లోక్ సత్తా పార్టీ… ఎక్కడో విన్నట్లు ఉంది కదా..? రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ జయప్రకాశ్ నారాయణ(jayaprakash narayan) పెట్టిన పార్టీ ఈ లోక్ సత్తా. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో… ఆ పార్టీ సిద్దాంతాలకు చాలా మంది ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు ఆయన పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే… ప్రజలను పార్టీ సిద్దాంతాలో కాస్త ఆకర్షించారు కానీ.. ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. దీంతో… పార్టీ మరుగునపడిపోయింది. జనాలు కూడా మర్చిపోయారు. అయితే… ఆయన మరోసారి ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ సారి… ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఆపై రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారనిపిస్తున్నారే తప్ప.. క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఐతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జేపీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తుండడం విశేషం.
తాజాగా విజయవాడలో జరిగిన లోక్సత్తా పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా జేపీ ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న తీర్మానం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశంలో జేపీ కూడా పాల్గొన్నారు. ఐతే ఆయన తాను పోటీ చేయడం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చేసిన కీలక వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేలాగే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అమరావతి రాజధాని మీద జేపీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కోర్టులు ఎప్పుడో స్పష్టం చేశాయని, చట్టప్రకారం నిర్ణయించిన రాజధానిని మార్చడానికి వీల్లేదని జేపీ స్పష్టం చేశారు. రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని విషయంలో ఏపీ సర్కారు తికమక చేస్తోందని ఆయనన్నారు. తుగ్లక్ కూడా రాజధానులు మార్చాడంటూ పరోక్షంగా సీఎం జగన్కు ఆయన చురకలంటించారు.