Faridabad నా భార్య కోసం కిడ్నీ అమ్మేస్తా.. లేదంటే చచ్చిపోతా
ఈ గొడవల కారణంగా నాలుగు నెలల గర్భాన్ని అత్తామామలు తీసి వేయించారు. దీనిపై నేను నిలదీస్తే వారు నాతో గొడవపడ్డారు. అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నారు. సాయం కోసం పోలీసులు, అధికారులను కోరాను.
భార్యాభర్తల మధ్య అనుబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్న విషయాలకు తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. విబేధాలను కూర్చుని పరిష్కరించుకోకుండా తమ బంధాలకు ముగింపు పలుకుతున్నారు. వేధింపులు, గొడవలు, వాగ్వాదాలతో బంధాలను రోడ్డు మీదకు ఈడుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మహిళలకే కాదు పురుషులకు ఎదురవుతున్నది. ఇటీవల బెంగళూరులో భార్య బాధితులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో భార్య బాధితుడు రోడ్డు మీద పడ్డాడు. భార్య వేధిస్తోందని.. ఆమెను వదులుకునేందుకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు అతడు ఏకంగా తన కిడ్నీనే అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ ఎవరూ కొనకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడుతానని బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నాడు.
బిహార్ లోని పట్నాకు చెందిన సంజీవ్ కు ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తుంటాడు. అతడికి ఆరేళ్ల కిందట ఓ యువతితో పెళ్లయ్యింది. వివాహమైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతడి భార్య కట్నం వేధింపుల కేసు నమోదు చేయించింది. దీంతో నాలుగు గోడల మధ్య జరుగుతున్న సంసారం రచ్చకు ఎక్కింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సంజీవ్ ను అరెస్ట్ చేశారు. బెయిల్ బయటకు వచ్చాక కూడా వేధింపులు తగ్గలేదు. భార్య, బావ మరిది, అత్తామామలు వేధింపులు తీవ్రం చేయడంతో అతడు విడాకులకు దరఖాస్తు చేశాడు. ఈ క్రమంలో భార్యకు రూ.10 లక్షలు భరణంగా చెల్లించాల్సి రావడంతో సంజీవ్ ఏం చేయాలో పాలుపోలేదు. ఈ క్రమంలోనే తన కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఓ బ్యానర్ గా రాసుకుని హర్యానాలోని ఫరీదాబాద్ లో తిరుగుతూ కనిపించాడు. ‘విడాకులు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని నా భార్య డిమాండ్ చేస్తోంది. ఈనెల 21వ తేదీలోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు నా భార్యకు ఇస్తా. లేకపోతే పట్నాలో ఆత్మాహుతి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లు రావాలి’ అని రాసిన బ్యానర్ తో తిరుగుతున్నాడు. ఆ బ్యానర్ పై భార్య, బావమరిది, ఇతర బంధువుల ఫొటోలు ఉంచాడు. ఇలా భార్య బాధితుడు రోడ్డు మీద పడడం వైరల్ గా మారింది.
అయితే తన భార్యతో ఉన్న గొడవ విషయంలో పోలీసులు, అధికారులను విన్నవించినా ఎవరూ పరిష్కరించడం లేదు. విడాకుల కోసం భార్య రూ.10 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఇలా రోడ్డుపై తిరుగుతున్నానని సంజీవ్ వాపోయాడు. ‘ఈ గొడవల కారణంగా నాలుగు నెలల గర్భాన్ని అత్తామామలు తీసి వేయించారు. దీనిపై నేను నిలదీస్తే వారు నాతో గొడవపడ్డారు. అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నారు. సాయం కోసం పోలీసులు, అధికారులను కోరాను. కానీ ఎవరూ స్పందించలేదు. వీటిపై విసిగిపోయి ఇలా బ్యానర్ తో తిరుగుతున్నా’ అని సంజీవ్ గోడు వెళ్లబోసుకున్నాడు.