»Hyderabad Union Minister Kishan Reddy Nephew Died
Breaking: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి (50) గుండెపోటుతో మృతి చెందాడు. కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు. కాగా జీవన్ రెడ్డి మృతిపై పలువురు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డికి పలువురు ఫోన్ లో పరామర్శించారు.
హైదరాబాద్ లోని సైదాబాద్ వినయ్ నగర్ లో జీవన్ రెడ్డి నివసిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కంగారుపడి కుటుంబసభ్యులు వెంటనే కాంచన్ బాగ్ లోని డీఆర్డీఎల్ అపొలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే అతడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. అయితే అతడి అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియల కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డితో అతడి కుటుంబసభ్యులు, బీజేపీ నాయకులు హాజరు కానున్నారు. కాగా ఈ వార్త తెలిసే సమయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఈ సమాచారంతో ఆయన వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు. దగ్గరుండి అల్లుడి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లుడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.