ఆసియా కప్ 2022లో టీమిండియా తిప్పలు తప్పడం లేదు. ఎంత హైస్కోర్ చేసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. అయితే… అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. భారత మహిళా జట్టు మాత్రం రికార్డు విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు.
కాంటెర్బరీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 88 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత శతకం బాదడంతో.. టీమిండియా 333 పరుగులు చేసింది. భారత మహిళ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ విజయంతో మరో వన్డే మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా టీ20ల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్ గడ్డ మీద భారత అమ్మాయిలు పరిమిత ఓవర్ల సిరీస్ గెలవడం 23 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత మహిళల జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగగా.. రెండు ఫోర్లు బాదిన షఫాలీ వర్మ 8 పరుగుల వద్ద కేట్ బౌలింగ్‌లో ఔటైంది. అనంతరం స్మృతి మందన్నా (40), యష్టికా భాటియా (26) స్కోరు బోర్డును ముందుకు నడిపారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద భాటియా ఔటవగా.. క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. 67 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హర్మన్.. 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత గేర్ మార్చిన హర్మన్.. చివరి 11 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులు బాదింది. దీంతో చివరి మూడు ఓవర్లలో భారత్ 62 పరుగులు రాబట్టింది. హర్మన్ దెబ్బకు ఇంగ్లిష్ బౌలర్ ఫ్రెయా కెంప్ 82 పరుగులు సమర్పించుకుంది. హర్మన్ 111 బంతుల్లోనే 143 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. డానియెల్లీ వ్యాట్ (68 పరుగులు) .. అల్సీ క్యాప్సీ (39) కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. వ్యాట్, అమీ జోన్స్ (39) వరుస ఓవర్లలో ఔటవడంతో ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. ఇంగ్లాండ్ అమ్మాయిలు 44.2 ఓవర్లో 245 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. దయాళన్ హేమలత 2 వికెట్లు పడగొట్టింది.