శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా చేసిన అనంతరం మాట్లాడారు. భారతీయ యోగాపై ఆయన ఏమంటున్నారంటే..?
PM Modi : ప్రపంచ దేశాలకు యోగా గురువుగా భారత్ మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Day of Yoga ) సందర్భంగా ఆయన ప్రసంగించారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ ఏ కశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్లో నేడు అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో ప్రధాని(PM) పాల్గొన్నారు. తొలుత ప్రజలు, రాజకీయ నాయకులు అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం జరిగిన సభలో మోదీ(PM Modi) యోగా గురించి మాట్లాడారు.
శ్రీనగర్‌లో(srinagar) ఒక ప్రత్యేకమైన శక్తి ఉందన్నారు. యోగా ద్వారా దాన్ని మరింత పెంచవచ్చని అన్నారు. 2014లో ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి దేశ విదేశాల్లో ఈ రోజును అంతా వేడుకలా చేసుకుంటున్నారని అన్నారు. ఏటా ఈ దినోత్సవం కొత్త రికార్డుల్ని సృష్టిస్తూనే వస్తోందని తెలిపారు.
ఈ యోగా దినోత్సవం ఇచ్చిన అవగాహనతో ఇప్పుడు విదేశాల్లో విశేషంగా ప్రజలు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారని ప్రధాని మోదీ(PM Modi) చెప్పుకొచ్చారు. జర్మనీలో రోజూ కోటిన్నర మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మన దేశంలో అనేక యూనివర్సిటీలు యోగా కోర్సుల్ని ప్రారంభించడం హర్షణీయమని ప్రశంసించారు. ఈ రోజు యోగా చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పులు వస్తాయని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ యోగాను రోజు వారీ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.