తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి శనివారం సభలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై శనివారం చర్చించారు. రెండు సభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి గవర్నర్ ప్రసంగంపై చర్చకు వచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బలపరిచారు.
ఇక శాసన మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. నిన్న బీఎసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈనెల 6వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ, 9, 10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ, 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుందని సీఎం వివరించారు. మిగతా విషయాలు ఏమైనా ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రభుత్వం దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు.