ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ వల్ల పాఠశాలలో చదువుతున్న 130 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థఆనికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బాలికలను హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలికలకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.
ప్రస్తుతం బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మరింత వైద్య సిబ్బందిని పిలిచి బాలికలకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఫుడ్ ఫాయిజనింగ్ ఘటనపై సత్తెనపల్లి ఆర్డీఓ రాజకుమారి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఫుడ్ పాయిజనింగ్ కు గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. బాలికలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి బావుందని డాక్టర్లు తెలిపారు.