ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి… ఇటీవల హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని… అందుకే ఇలా కాళ్లు మొక్కారంటూ వారత్లు వచ్చాయి. ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కారం చేయడం ఏంటనే విమర్శలు వచ్చాయి.
ఐతే ఈ విమర్శలపై శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. ఒక్కసారి కాదు వందసార్లు కేసీఆర్కు పాదాభివందనం చేస్తా అని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం విశేషం. ఈ మధ్య నేను కేసీఆర్ గారి పాద పద్మాలకు నేను నమస్కరించాను. దాని గురించి విమర్శిస్తున్నారు. ఒక్కసారి కాదు బరాబర్ వందసార్లు ఆయనకు పాదాభివందనం చేస్తా.
ఎందుకంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆయన వైద్య కళాశాల ఇచ్చారు. కొత్త కాలేజీలు ఇచ్చేందుకు గాను నిర్వహించిన సమావేశంలో నేను కూడా పాల్గొన్నా. నిజానికి ముందు మన జిల్లా పేరు అందులో లేదు. కానీ కేసీఆర్ గారు మన జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారు. కేసీఆర్ అభినవ బాపూజీ అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. శ్రీనివాసరావు తీరు చూస్తుంటే అతి త్వరలో పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేలా కనిపిస్తున్నారు.