VKB: జిల్లాలో నేషనల్ మిన్స్ కం మెరిట్స్ (NMMS) స్కాలర్‌షిప్‌కు 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పరీక్షకు 1,097 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 78 మంది ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ప్రభుత్వం స్కాలర్‌షిప్స్ అందించనుంది. ధ్రువీకరణ పత్రాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు.
NGKL: నెలరోజుల పని దినాలు కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ మార్చి 1వ తేదీ నుంచి స్పాట్ బిల్లర్స్ సమ్మెలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో స్పాట్ బిల్లర్ అసోసియేషన్ నాయకులు కల్వకుర్తిలోని విద్యుత్ ఎంప్లాయిస్ 327 యూనియన్ నాయకులు శ్రీధర్ చారి, శ్రీనివాస్ రాజు తదితరులకు శనివారం వినతి పత్రం అందజేశారు.
KMM: సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన రూ. 541 కోట్ల సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎర్రుపాలం మండలంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన లేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కుంభకోణంలో నిందితుల మూలాలు బయటపెట్టేందుకు విచారణ వేగవంతం చేశారు.
SRPT: అనంతగిరి మండలం మొగ్గులాయికోట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి రెండు కిలోమీటర్ల మేర అధ్వానంగా ఉంది. గ్రామస్తులు ఈ రహదారి గుండా వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. సరైనా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు సొంత ద్విచక్ర వాహనాలపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి. వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు విధించి బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
KMM: మంత్రి తుమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ రఘుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఖాదర్ బాబా అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులకు నేతలు ఫిర్యాదు చేశారు. భూదాన్ భూముల విషయంలో జర్నలిస్టు రఘు సీనియర్ మంత్రి తుమ్మలపై అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వనపర్తి పట్టణం 6వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోకం పాండు హైదరాబాదులోని రేంజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం ఆయనను పరామర్శించడు. అనంతరం వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడవద్దు అని, అండగా ఉంటానని భరోసానిచ్చారు.
NZB: ధర్పల్లిలో శనివారం సర్పంచ్ సీహెచ్.శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ప్రతి రెండు నెలలకోసారి జరిగే ఈ సభలో భాగంగా, గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గత రెండు నెలల్లో నూతన పాలకవర్గం చేపట్టిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన జమా ఖర్చుల వివరాలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ప్రజలకు చదివి వినిపించారు
BHNG: ఆలేరు పట్టణ కేంద్రంలోని సిల్క్ నగర్ కాలనీలో వీధిలైట్లు లేకపోవడం వల్ల చీకటిగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక వాసులు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్‌కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి వీధిలైట్లను వేయించడం జరిగింది. పట్టణ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
NLG: టైలరింగ్ వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. టైలర్స్ డే సందర్భంగా నకిరేకల్‌లోని మెయిన్ సెంటర్‌లో టైలర్స్ యూనియన్, మేరు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. టైలరింగ్ వృత్తిదారులకు సమాజంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి శనివారం పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డులోనూ ప్రతిరోజూ పరిశుభ్రత పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.
RR: గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ఠాప, భోగ్ బండారో ప్రత్యేక పూజ కార్యక్రమం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీకి గిరిజన నాయకులు, మహిళలు, తండావాసులు తరలివచ్చారు.
HYD: గచ్చిబౌలి హాకీ స్టేడియం మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్‌లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7.30 గంటలకు CM రేవంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించనున్నారు.
KMM: వైరా మండలం సోమవారం గ్రామంలోని శ్రీ కానిపాకం విగ్నేశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లతో సిబ్బంది సరైన విధంగా ప్రవర్తించడం లేదని ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తరువాత వాచర్లు ఇవ్వడం లేదని, అడిగితే లేవని నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఉన్న కొంతమంది టైలర్స్ని శాలువాతో సత్కరించి అభినందించారు. టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టైలర్స్‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు.
BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, విశ్వక్సేన పూజ, కంకణధారణ తదితర కార్యక్రమాల మధ్య అర్చకులు నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.