ADB: తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
HYD: ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కాలనీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు CM రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఫ్యూచర్ సిటీలో కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే జర్నలిస్టులకు కూడా శుభవార్త చెబుతామని వెల్లడించారు.
MHBD: కురవి పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు జీ.అనిత, ఈ.సుధారాణి, టీ.శ్రీవాణి, పుష్పలతలను ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి, సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
NLG: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం TPUS నల్లగొండ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కార్యదర్శి తులసి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి విచ్చేసి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సంఘటిత శక్తితో హక్కులను సాధించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
NGKL: అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నారని, విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
VKB: పరిగి మండలం రాపోల్లో కావలి పద్మమ్మ నూతన ఇందిరమ్మ గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు రాపోలు గ్రామానికి 18 ఇందిరమ్మ ఇళ్లను మంజూరయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.
NRML: సైనిక నియామకాలకు యువతకు ఉచిత శిక్షణ అందిస్తానని మాజీ సైనిక ఉద్యోగి రవీందర్ తెలిపారు. దేశ రక్షణలో 24 సంవత్సరాలు సరిహద్దుల్లో సైనికునిగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఆయనను ఆదివారం కుమ్మరి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
BHPL: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్‌వైజర్ రాజ్ చేతుల్లో బందీ అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పేరిట రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాడని, డబ్బు ఇవ్వకపోతే పోస్టింగ్ ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచరణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
PDPL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ 7వ వార్డులో నిర్వహించిన వేడుకలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించారు.
SRCL: 14 నుంచి 15 ఏళ్ల వయసులోపు బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపి లోమా వైరస్) వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ గార్ల NFIW మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాంబ లక్ష్మి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం, గౌరవప్రదమైన జీవన హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలకు గుర్తుగా నిర్వహించబడుతోందని అన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని పిలుపునిచ్చారు.
GDWL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, DMHO సంధ్యా కిరణ్మయి తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, జిల్లాలో 7,103 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించారు.
NLG: చిట్యాల మండలం ఏపూరిలో ఆకస్మికంగా మృతి చెందిన ఎరసాని కృష్ణయ్య కుటుంబానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెం కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తీవ్ర ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. మృతదేహానికి ఇవాళ పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు ఎల్లయ్యను పరామర్శించారు. వీరితో పాటు లింగస్వామి, నరసింహ పాల్గొన్నారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆదివారం ఓ పాత ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి నిర్వాహకులు సామగ్రిని అక్కడే విడిచి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకొని అందులోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
BDK: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు. కొత్త కోల్ బ్లాకుల సాధనతో పాటు, ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కింద రూ.30 లక్షల వడ్డీ లేని రుణం అందించాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.