HNK: ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ పుట్టా రేణుక కుమారస్వామి అన్నారు. నారాయణగిరి గ్రామంలో రూ. 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఇవాళ సర్పంచ్ శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
జనగాం: మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని ఆమె అన్నారు.
NLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్జీ కళాశాల మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు 5కే రన్ నిర్వహించారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉన్నట్లు అని ఆమె సూచించారు.
MNCL: దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద విద్యుత్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక ఎస్సై తహసీద్దీన్ కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంక్ వద్ద నుంచి స్టాండ్‌ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్‌కు తగలడంతో మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందారన్నారు.
WGL: ప్రజాపాలన – ప్రజా ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో సోమవారం కాలువల శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగాపాణి పాల్గొని కాలువల శుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మున్సిపాలిటీ ముఖ్య లక్ష్యమని తెలిపారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండి ఇతర కానుకల పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని ఈవో తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
VKB: రోడ్డు పూర్తిగా గుంతలు పడి నిత్యం వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. VKB నుంచి నాసన్‌పల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా గుంతలు పడి నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
NGKL: జిల్లాలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. అటు వాహనాల వేడి, ఇటు నెత్తిన మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
KNR: చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను చివరి వరకు కొనుగోలు చేసి ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కంపేట్ అధికారులను ఎమ్మెల్యే కోరారు.
HYD: ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు ICMR నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా 45 ఏళ్లలోపు ప్రతి ఏడుగురిలో ఒకరికి స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్, జీవనశైలిలో మార్పులు ప్రధాన కారణాలుగా HYD తార్నాక ICMR అధికారులు తెలిపారు.
RR: గచ్చిబౌలిలో జరిగిన “కమ్మ ఐకాన్ లెజెండరీ అవార్డ్స్ – 2026” వేడుకలో ప్రముఖ సామాజిక కార్యకర్త, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారాన్ని అందుకున్నారు. సమాజ సాధికారత, విద్య, వైద్యం, పేదల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.
MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులే ఉపాధ్యాయులుగా పిల్లలకు పాఠాలు బోధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్, ఉపాధ్యాయులు సుకన్య, జ్యోతి, తాజా మాజీ విద్యా కమిటీ చైర్మన్ రతన్ లాల్ పాల్గొన్నారు.
KMM: ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవి (52) హత్య కేసు మిస్టరీని పోలీసులు సోమవారం ఛేదించారు. భర్త అనారోగ్యంతో చనిపోతాడని భావించిన భార్య అతడి పేరుపై రూ. 66 లక్షలకు బీమా చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బుల కోసం భర్తను దారుణంగా చంపించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
SRD: ఖేడ్ నియోజకవర్గం ST సర్పంచుల నూతన ఫోరం అధ్యక్షుడిగా తుర్కపల్లి తండా సర్పంచ్ నెహ్రూ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నేడు గిరిజన సర్పంచులు సమావేశమై తీర్మానించారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎస్టి సర్పంచులకు ఎలాంటి సమస్యలు ఉన్న ఫోరం ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇందులో దిశా కమిటీ జిల్లా సభ్యుడు ప్రకాష్ రాథోడ్ ఉన్నారు.