WNP: వీపనగండ్ల మండలానికి నూతనంగా ఎస్సైగా నియమతులైన నరేష్ కుమార్‌ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాద కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కల్వరాల గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ పనిచేయడం లేదని అన్నారు. అట్టి సీసీ కెమెరాలను మరమ్మత్తులు చేయించి ఉపయోగంలోకి తేవాలని తెలిపారు.
PDPL: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని IFTU రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. కార్మికుల హక్కులను కాలరాసే కోడ్లను వెనక్కి తీసుకోవాలన్నారు.
BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలోని మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 21న నిర్వహించే ఈద్-ఉల్-ఫిత్ నమాజ్ కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇవాళ గ్రామ సర్పంచ్ హసీనా బాను-అక్బర్ ఖాన్ ఆదేశాల మేరకు ఈద్గా ప్రాంగణాన్ని డోజర్ సహాయంతో చదును చేశారు. ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థలాన్ని ముందస్తుగా సవ్యంగా సర్దుబాటు చేసి పరిశుభ్రం చేయించారు.
HYD: స్త్రీనిధి సంస్థ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, రికవరీ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1947 కోట్లు, ఈ ఏడాది ఇప్పటికే రూ.2064 కోట్లు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
KNR: సమస్యల పరిష్కారం కోసం ఎంతో దూరం నుంచి ప్రజావాణికి వచ్చి విన్నవించే బాధితులకు అధికారులు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలను స్వీకరించారు.
MNCL: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దానికి తలూపుతున్న ప్రధాని మోడీ ఇరాన్‌పై యుద్ధం ఆపి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన సెమినార్‌లో మాట్లాడుతూ.. యుద్ధంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి నెలకొందని, వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.
SDPT: కోహెడ మండలంలో వంటగ్యాస్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్యాస్ బుకింగ్ సరిగా కాకపోవడం, టోల్ ఫ్రీ నంబర్లు నిరంతరం బిజీగా ఉండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో సరఫరా తగ్గిందనే సమాచారం ఉంది. గ్యాస్ దొరకకపోవడంతో కోహెడలో చిరు వ్యాపారులు కట్టెల పొయ్యిలపై వంట చేస్తూ కనిపించింది.
SRPT: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఐదు నెలలుగా జీతాలు లేక అద్దెలు కట్టలేక, వైద్య ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1లోగా సమస్య పరిష్కరించకుంటే విధులను బహిష్కరిస్తామని అన్నారు.
BDK: కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న SHOలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
NZB: టీయూలో ట్రైనింగ్&ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో రేపు డిచ్పల్లి క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా. పాత నాగరాజు మాట్లాడుతూ.. 50కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MLG: ములుగు మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆదాయ–వ్యయాల అంచనాలను పరిశీలించిన కౌన్సిలర్లు బడ్జెట్‌ను ఆమోదించారు. మున్సిపాలిటీకి స్వంత ఆదాయం రూ.352 లక్షలు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.1720 లక్షలు లభిస్తాయని అంచనా వేశారు.
SRD: నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండ గ్రామంలో మహిళా సమైక్య భవనం నిర్మాణానికి సోమవారం సర్పంచ్ మంజుల శంకర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్థానికంగా మహిళ భవనం నిర్మాణానికి సెక్రటరీ సుమ భవన నిర్మాణానికి కొలతల ముగ్గును వేయించారు. మహిళల పొదుపు సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి అవకాశానికి ఉచిత శిక్షణ కార్యక్రమాలకు భవనం ఉపయోగపడుతుందన్నారు.
NLG: త్రిపురారం మండలంలో దివ్యాంగులకు SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నారు. అయితే, మండలంలోని దివ్యాంగులకు కాకుండా ఇతర మండలాల వారికి శిక్షణ ఇస్తుండడంతో స్థానికులకు అన్యాయం జరుగుతోందని అన్ ఎంప్లాయ్ డిజేబుల్ యూత్ ఆప్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూర నాగయ్య గౌడ్ ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ASF: రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి బవేశ్ మిశ్రని సోమవారం మాజీ MLA ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. తీర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో అనేక గ్రామాలకు సెల్ సిగ్నల్స్ లేని కారణంగా ప్రజలు, ముఖ్యంగా పింఛన్ దారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సెల్ సిగ్నల్స్ లేని గ్రామాలకు సిగ్నల్స్ అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు.
HNK: శాయంపేట మండలం మైలారం గ్రామంలో కోస్టల్ పనుల కారణంగా భూములు కోల్పోయిన రైతులు తమపై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కొందరు తమను వేధించారని, డబ్బులు వసూలు చేశారని వ్యాప్తి చేస్తున్న ప్రచారాలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ఎవరూ వేధించలేదని, ఎలాంటి అధికారులు లేదా నాయకులు డబ్బులు కోరలేదని, తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు