KNR: బాలల హక్కుల పరిరక్షణపై గ్రామ సభల్లో ప్రజలందరికీ విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ సూచన మేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు, ఉపాధ్యాయులకు బాలల హక్కులపై వర్క్ షాప్ నిర్వహించారు.
SRPT: మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. హాస్టల్ గదులు, వంటశాలను పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ అమలుపై ఆరా తీశారు. పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
MBNR: రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం పట్టణంలోని పేద ముస్లిం సోదరులకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మమత శ్రీనివాస్ నూతన దుస్తులను పంపిణీ చేసి సహాయ హస్తం అందించారు. ప్రతి ఏడాది ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేలా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని సీహెచ్‌సీ (CHC) హెల్త్ కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీజేపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఫోటోలు ఫ్లెక్సీల్లో లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. కార్యక్రమంలో BJP నేతలు పాల్గొన్నారు.
WGL: నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హాల్‌లో హజ్ యాత్రికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎంజీఎం నుంచి ఆరుగురు జనరల్ ఫిజిషియన్‌లు, టెక్నిషియన్‌లు, జిల్లా ఆరోగ్య శాఖ నుంచి నలుగురు వైద్యులు పాల్గొని సేవలు అందించారు. మొత్తం 52 మందికి వైద్య పరీక్షలు, ఈసీజీ, ల్యాబ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
KMM: వెలుగుమట్ల భూముల్లో అనర్హులకు స్థలాలు కేటాయించడాన్ని నిరసిస్తూ CPI(ML) ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 2018 నుంచి అక్కడ నివసిస్తున్న 400 మంది అసలైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించి, అర్హులైన వారికే ఇళ్లు ఇవ్వాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
BDK: గుండాల మండలం ముతాపురం ఏకలవ్య పాఠశాలను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. తరగతి గదులు, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, కంప్యూటర్ ల్యాబ్ తదితర సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాలు సరఫరా, పరీక్షల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
JGL: గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించుకోవాలని MO. డా. కృష్ణ కుమారి సూచించారు. జగిత్యాలలోని జేఎస్ రాంవెల్ గాంధీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. కృష్ణ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించి, పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అనంతరం రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై గర్భిణులకు అవగాహన కల్పించారు.
KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదల అయ్యాయని ఎగ్జామ్ ఇన్‌ఛార్జ్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx వెబ్‌సైట్ చూసుకోవాలని ఆయన సూచించారు.
NGKL: ఊర్కోండ మండలంలోని జాతీయ రహదారి (167) పై మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి నుంచి తిమ్మన్నపల్లి వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే మదన్ మెహన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తూ ఎల్లారెడ్డి ప్రజలు స్పష్టమైన తీర్పును గుర్తుచేశారు.
MNCL: నస్పూర్‌లోని కేజీబీవీ పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 56 మందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, కార్పొరేటర్ పుట్ట యశోద కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కంటి వ్యాధులు రాకుండా పోషకాహారాలు, విటమిన్ ఏకు సంబంధించిన ఆహార పదార్థాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు.
MLG: ఖమ్మం రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దాసరి మునీందర్‌ను డిప్యూటేషన్‌పై ములుగు ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ప్రభుత్వం నియమించింది. రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన మంగళవారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికారు.
సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, భవనాల పన్ను 100 శాతం వసూలు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు, ఇంటి పన్ను వసూలు, పారిశుధ్య పనులు, నీటి సరఫరా, మున్సిపల్ బడ్జెట్, తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు, టీపీవోలు ఇతర అధికారులతో సమీక్షించారు.
NLG: చిట్యాల పట్టణంలోని హోటళ్లు, ధాబాలు, ఫాస్ట్ ఫుడ్, రీఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా వాడుతున్న 15 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6A సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.