Congress Partyలో భగ్గుమన్న వర్గ పోరు.. వరంగల్ లో చెప్పులతో కొట్టుకున్న నేతలు
సమావేశంలో పరస్పరం కార్యకర్తలు దాడి చేసుకున్నారు. ఒకరిపై నొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చొక్కాలు చించుకున్నారు. మరింత శ్రుతిమించి చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరింది.
కాంగ్రెస్ పార్టీలో (Congress Party) వర్గ పోరు అనేది ఎప్పటికీ పరిష్కారం కానీ సమస్యే. అగ్ర నాయకుల మొదలుకుని గల్లీ నాయకుల వరకు ఆ పార్టీ నాయకుల మధ్య విబేధాలు ఉంటాయి. ఇప్పటికే అగ్ర నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతుండగా.. తాజాగా జిల్లాలకు కూడా ఆ వర్గ పోరు (Group Politics) రాజుకుంటోంది. తాజాగా వరంగల్ జిల్లాలో (Warangal District) పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో వరంగల్ కాంగ్రెస్ పార్టీ పరువుపోయింది.
వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను (Erraballi Swarna) ఇటీవల నియమించారు. డీసీసీ అధ్యక్షురాలిగా (DCC Chief) బుధవారం ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలోనే వర్గ విబేధాలు బయటపడ్డాయి. స్వర్ణ నియామకంపై మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మాజీ ఎమ్మెల్సీ మురళీ వర్గం గుర్రుగా ఉంది. ఆ కోపాన్నంతా ప్రమాణస్వీకారం (Swearing Ceremony) రోజే చూపించారు. ఈ కార్యక్రమానికి కొండా దంపతులు హాజరుకాలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య వివాదం రాజుకుంది. ఈ సమయంలో కొండా వర్గానికి చెందిన ఎస్సీ సెల్ నాయకుడు సంతోష్ పై దాడి జరిగింది. దీంతో సమావేశంలో పరస్పరం కార్యకర్తలు దాడి చేసుకున్నారు.
ఒకరిపై నొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చొక్కాలు చించుకున్నారు. మరింత శ్రుతిమించి చెప్పులతో (Sandals) కొట్టుకునే స్థాయికి చేరింది. అసంతృప్తి స్వరాలను బుజ్జగించేందుకు పీసీసీ స్థాయిలో ఎవరూ చర్య తీసుకోలేదు. కొంతమంది నచ్చజెప్పడంతో వివాదం (Quarrel) ముగిసింది. వరంగల్ తూర్పు (Warangal East) నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ విషయమై ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కోపతాపాలు ఉన్నాయి. పీసీసీ వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోకపోతే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.