వరంగల్ జిల్లాలో ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన మెడికల కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణలో భవిష్యత్తులో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఎన్నో త్యాగాలు, ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్ విద్యార్ధులకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.
ఏ దేశమైనా, సమాజమైనా చుట్టూ జరిగే పరిణామాలు గమనించి అందుకు తగ్గట్టుగా అప్రమత్తంగా ఉంటేనే అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అనుభవించిన కష్టాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రాన్ని కోల్పోయి అస్తిత్వాన్ని నిలుపుకోడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చిందన్నారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు.
రాజకీయ విమర్శలతో సంబంధం లేకుండా తెలంగాణ పురోగతి సాధించిందని, దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ముంబై కంటే జిఎస్డిపి వృద్ధి తెలంగాణలో ఎక్కువని, ఆర్ధికాభివృద్దిలో సైతం తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణలో రాష్ట్రాన్ని విమర్శించే కేంద్ర మంత్రులు ఢిల్లీలో అవార్డులు అందిస్తారని చెప్పారు.
తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధించ గలుగుతున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 33జిల్లాల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 2014 ముందు తెెలంగాణలో 2800 మెడికల్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 6500 మెడికల్ సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని కాలేజీలు అందుబాటులోకి వస్తే 10వేల సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు రష్యా, చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం విద్యార్ధులకు ఉండదన్నారు.
పీజీ మెడికల్ సీట్లలో 1150 సీట్లు గతంలో ఉంటే ఇప్పుడు 2500 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని అన్ని రంగాల్లో పురోగమిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.