భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాకిచ్చింది. 69 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో నేడు ఆఫ్ఘన్ జట్టు ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఆఫ్ఘన్ టీమ్ షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 69 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 40.3 ఓవర్లలోనే 215 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 66 పరుగులతో స్కోరును కదిలించాడు. ఆ తర్వాత బెయిర్ స్టో 2, బట్లర్ 9, జో రూట్ 11, లివింగ్ స్టోన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ నబీ రెండు వికెట్లు తీయగా నవీల్ ఉల్ హక్, ఫారూఖీ చెరోక వికెట్ ను తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రహ్మానుల్లా గుర్బాజ్ 80 పరుగులు, ఇక్రమ్ అలీఖిల్ 58 పరుగులతో జట్టును ఆదుకున్నారు. ఇబ్రహీం జద్రాన్ 28, ముజీబ్ ఉర్ రహ్మాన్ 28, రషీద్ ఖాన్ 23 రన్స్‌తో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీయగా మార్క్ వుడ్ రెండు వికెట్లు, లివింగ్ స్టోన్, రూట్, టాఫ్లీలు తలొక వికెట్‌ను పడగొట్టారు.