నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో సందేహం లేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్, వివిధ కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయనకు రాజకీయాలు అచ్చి రాలేదో.. సరిపోలేదో కానీ మొత్తానికి దూరం పాటిస్తున్నారు. ఆయనను లాగేందుకు మాత్రం పార్టీలు ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాలకు దూరమని వివిధ సందర్భాల్లో చెప్పినప్పటికీ, ఏదో విధంగా చర్చకు వస్తూనే ఉంటుంది.
కాంగ్రెస్ ఏమంటోంది
తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు భిన్నవాదన వినిపిస్తున్నారు. మెగాస్టార్ తమ పార్టీలోనే ఉన్నారని అంటున్నారు. గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు రుద్రరాజు స్పందించారు. ఆయన పార్టీలోనే ఉన్నారని, సోనియా, రాహుల్ గాంధీలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు తన రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి…. కొద్ది రోజుల క్రితమే మరోసారి తనకు పట్టవని చెప్పారు. కానీ అంతలోనే చిరంజీవిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. రాజకీయాలకు నేను దూరంగా జరిగా కానీ నాకు రాజకీయం దూరం కాలేదనే సినిమా డైలాగ్‌ను గతంలో చిరు ట్వీట్ చేసిన మరుసటి రోజునే హస్తం పార్టీ ఆయనకు ఐడీకార్డును కూడా జారీ చేసింది. ఆయనను ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని జారీ చేసింది. ఆయన చివరిసారి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, రాజకీయాలను పట్టించుకోవడం లేదు. రాజీనామా ప్రకటన వంటి వాటిని ఆయన అఫీషియల్‌గా చేయకపోవచ్చు. కానీ దూరం మాత్రం పాటిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఇప్పటికీ తమ పార్టీలోనే ఉన్నారని చెబుతోంది.
చిరంజీవికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లతోను సత్సంబంధాలే ఉన్నాయి. ఏ నాయకుడితో లేదా పార్టీతో అయినా అలాంటి సంబంధాలనే కోరుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు కాబట్టే… రాజకీయాలకు సరిపోలేదని చెప్పవచ్చు. అంతెందుకు, జనసేనతో ఏపీలో దూసుకెళ్తున్న సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్‌కే బాహాటంగా మద్దతివ్వడం లేదు. తనకు పవన్ కళ్యాణ్ కొడుకుతో సమానమని, ఆయన ఎదగాలని కోరుకుంటానని కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. కానీ పార్టీపరంగా జనసేనకు మద్దతు అడిగితే, రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు సూటిగా చెప్పారు. ఎన్నికల సమయంలో మద్దతిస్తారా లేదా అనే అంశం మున్ముందు తేలుతుంది. కానీ ఎన్నికల సమయంలో తమ్ముడికి అండగా ఉంటారనడంలో సందేహం లేదు.
2024లో ఎలా?
గతంలోను కాంగ్రెస్ పలుమార్లు చిరంజీవిని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేసింది. అన్నయ్య మా వాడేనని కాంగ్రెస్ ఎలా అయితే చెబుతోందో, మెగా సోదరులు… అభిమానులు కూడా తమ్ముడికి అన్నయ్య మద్దతు ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నారు. చిరంజీవి కోసం గతంలో బీజేపీ కూడా ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెగా నటుడు తమపై చేసిన ప్రశంసలను ఆయా పార్టీలు ఉపయోగించుకోవడానికి ఉత్సాహం చూపించిన సందర్భాలెన్నో చూశాం. చిరంజీవిని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించని పార్టీ ఉండదనే చెప్పాలి.
ఏదేమైనా తాను రాజకీయాలకు దూరం మొర్రో అని చెబుతున్నప్పటికీ, కొన్నేళ్లుగా ఆయా పార్టీలు చిరంజీవి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పి అందరినీ విస్మయపరిచింది. అయితే, ఆయన అధికారికంగా రాజీనామా చేయకపోయి ఉండటం వల్ల, ఆ టెక్నికల్ పాయింట్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో ఉంటారా? పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలుస్తారా? ఇప్పటిలా సమదూరం పాటిస్తారా?…. చూడాలి.