karnataka Elections 2023: సిద్ధరామయ్య vs డీకే..! అసలు వీళ్లెవరు..? వీళ్ల చరిత్రేంటి?
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక్కటే అదే కర్ణాటకకి సీఎంగా ఎవరిని ప్రకటించాలనే సమస్య. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యల మధ్యే..
Siddaramaiah Is The Best Option To CM Post:Yatindra
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం, అందులోనూ పూర్తి మెజారిటీతో గెలవడం దాదాపు ఖరారైపోయినట్లే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తెరమీదకొస్తున్న సమస్య, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక్కటే అదే కర్ణాటకకి సీఎంగా ఎవరిని ప్రకటించాలనే సమస్య.
ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యల మధ్యే అసలు పోటీ నెలకొంది. అయితే వీళ్లిద్దరిలో ఎవరు సీఎం సీట్‌కి అర్హులో మనం నిర్ణయించలేం కానీ.. అసలు వీళ్లిద్దరూ పార్టీకి ఏం చేశారు..? ఎవరికి ఎక్కువ అర్హతలున్నాయి..? వంటి ప్రశ్నలకు మాత్రం ఒక్కసారి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ఈ లిస్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురించే చూద్దాం. సిద్ధరామయ్య 1978లో మైసూర్ తాలూకా నుంచి భారతీయ లోక్ దళ్ తరపున కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.
ఆ తర్వాత 1989లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 92లో జనతాదళ్ సెక్రటరీ జనరల్ పదవి పొందారు. 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పదవి పొందారు. అక్కడి నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవి నిర్వహించిన సిద్ధరామయ్య 1999లో జనతాదళ్ విడిపోయినప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు.
తర్వాత జనతాదళ్(సెక్యులర్) పార్టీలో చేరి పార్టీ కర్ణాటక అధ్యక్షుడయ్యారు. కానీ 5 ఏళ్లలోనే పార్టీలో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆయన అధ్యక్ష పదవి పోయింది. అలాగే పార్టీ నుంచి కూడా బయటకొచ్చి 2004లో కాంగ్రెస్‌లో చేరారు.
అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పాదయాత్రలు, ర్యాలీలు చేసి పార్టీలో ముఖ్యమైన లీడర్లలో ఒకరిగా ఎదిగారు. 2013లో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2018లో కూడా ఎమ్మెల్యేగా గెలిచినా జేడీఎస్‌తో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సీఎం కాలేకపోయారు.
ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎలక్షన్ల ముందు జరిగిన ప్రచార సభల్లో సిద్ధరామయ్య చాలాసార్లు ఉద్వేగభరితంగా మాట్లాడారు. తనకు 76 ఏళ్లు వచ్చాయని, తనకు ఇదే ఆఖరి ఎలక్షన్స్ అని, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని భావోద్వేగమైన స్పీచ్‌లు కూడా ఇచ్చారు. ఈ లెక్కన ఆఖరి ఎన్నికలు కాబట్టి సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు.
ఇక కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ విషయానికొస్తే.. 1980ల్లో స్టూడెంట్ లీడర్‌గా కాంగ్రెస్‌తోనే మొదలైన డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే వరకు వచ్చింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ తరపున స్టూడెంట్ లీడర్‌గా 1980ల్లో కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా మైసూరు జిల్లాలోని సతనూరు నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు శివకుమార్ వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే. అక్కడి నుంచి 1994, 99, 2004, 08, 13, 18.. ఇలా ఒక్కసారి కూడా ఓటమనేదే లేకుండా గెలుపొందుతూ వస్తున్నారు. ఇక 2020లో ఏకంగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
కాంగ్రెస్ హైకమాండ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కర్ణాటకలో డీకే శివకుమార్ చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక డీకే శివకుమార్‌కి ట్రబుల్ షూటర్ అనే పేరు కూడా ఉంది. పార్టీల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలను శాంతపరచాలన్నా, లేదా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయాలన్నా, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలన్నా ఎన్నోసార్లు డీకే కీలక పాత్ర పోషించారు.
2002లో మహరాష్ట్రలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడడం, గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడడం, మరీ ముఖ్యంగా 2018లో ఎన్నికల తర్వాత జనతాదళ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడంలోనూ శివకుమార్‌ది కీలక పాత్రగా చెబుతారు. అంతేకాదు.. భారతదేశంలోని పొలిటీషియన్స్లోనే బాగా ధనవంతులైన నేతల్లో డీకే శివకుమార్ కూడా ఒకరు.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్స్కి, ప్రచారాలకి అన్నింటికీ డీకే శివకుమార్ చాలా ఖర్చు పెట్టారట కూడా. ఇన్ని క్వాలిటీలున్న శివకుమార్.. రాష్ట్రానికి సీఎం అయితే అటు అధిష్ఠానానికి, ఇటు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతారనేది విశ్లేషకుల మాట.
ఏది ఏమైనా ఓ వైపు సీనియారిటీ, అనుభవం, ఆఖరి చాన్స్ వంటి మాటలతో సిద్ధరామయ్య.. ఇంకో వైపు ట్రబుల్ షూటర్, రాజకీయ వేత్త, లీడర్షిప్ క్వాలిటీలు పుష్కలంగా ఉన్న నాయకుడిగా శివకుమార్.. సీఎం సీటు కోసం పోటాపోటీగా ఉన్నారు. మరి ఆఖరి సారి కాబట్టి డీకే శివకుమార్ తాను తప్పుకుని సిద్ధరామయ్యను సీఎం అవ్వనిస్తారో లేక డీకేనే బలమైన లీడర్ అని సిద్ధరామయ్యే సీఎం రేస్ నుంచి తప్పుకుంటారో చూడాలి.