కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50 సీట్లు కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 2019 తరహా మ్యాజిక్ పని చేయదన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివెల్కు హాజరైన ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో కమలం పార్టీ చాలా ఎంపీ సీట్లను కోల్పోతుందని, అలాగే కేంద్రంలోను అధికారం కోల్పోయే అవకాశాలు లేకపోలేదని, అందుకు 2019 ఎన్నికలే నిదర్శనమన్నారు. 2019ని పరిశీలిస్తే హర్యానా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన సీట్లను గమనించవలసి ఉందన్నారు. పుల్వామా దాడులు, బాలాకోట్ స్ట్రైక్స్ వంటివి కూడా గత ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు అన్నారు.
ఇప్పుడు అలాంటివి జరగడం లేదని వ్యాఖ్యానించారు. 303 స్థానాలు ఉన్న బీజేపీ 50 సీట్లలో ఓడిపోతే ఇతర పార్టీలకు గతంలో కంటే ఎక్కువ వస్తాయని, అలాంటి సమయంలో విపక్ష పార్టీల నుండి ఎంపీలను లాక్కొని అధికారం చేపట్టవచ్చునని చెప్పడం గమనార్హం. బీజేపీ 250 స్థానాల్లో గెలిస్తే, ఇతర పార్టీలు 290 స్థానాలను కైవసం చేసుకుంటే, అధికార పార్టీ పది నుండి ఇరవై మంది ఎంపీలను లాక్కొనే అవకాశాలు లేకపోలేదన్నారు.
అయితే శశిథరూర్ ఒక విషయం మరిచిపోయినట్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి స్వయంగా 303 సీట్లు వచ్చాయి. 2014లోని 273 స్థానాలతో పోలిస్తే ఇరవై ఎక్కువ. మిత్రపక్షాలతో కలిపి నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(NDA)గా ఉంది. ఎన్డీయేలోని ఇతర పార్టీలతో కలిసి 350కి పైగా సీట్లు గెలిచారు. కొందరు మిత్రపక్షాలు దూరమైన, ఇప్పటికీ 330 స్థానాలతో ఉంది ఎన్డీయే. అంటే శశిథరూర్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 280 నుండి 300 సీట్లకు పైగా వస్తాయి. మిత్రపక్షాలతో కలిసి ఇది క్లియర్ మెజార్టీ అన్నమాట.