తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు జెడ్ క్యాటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ కోసం ఏకంగా 33 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను నియమించింది. అన్నామలై భద్రత కోసం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. థ్రెట్ ఉండటంతో ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. హిట్ లిస్టులో ఉన్నారనే సమాచారంతో భద్రతను కేంద్రం పెంచింది. ఇప్పటికే మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి. విషయం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేడంతో సెక్యూరిటీ పెంచింది.
తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ పెరుగుతున్నాయి. నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అధికార పార్టీ డీఎంకే తప్పిదాలను అన్నామలై ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేశారు. ఉగ్రవాద ఘటనలపై డీఎంకే ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని కూడా అన్నామలై విమర్శించారు. దీంతో ఆయన వారి హిట్ లిస్ట్ జాబితాలో చేరిపోయారు. అన్నామలై తమిళనాడు స్వస్థలం.. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.. కానీ కర్ణాటక కేడర్ అధికారిగా పనిచేశారు. 2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. యువ నాయకుడు కావడం, యాక్టివ్గా ఉండటంతో ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ప్రజల్లోకి వెళుతున్న ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విమర్శిస్తున్నారు.
తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే అధికారం చేపడుతాయి. అన్నాడీఎంకేలో నాయకత్వం లోపం కనిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో లీడర్ షిప్ లోపించింది. ఉన్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం తమ గ్రూపు రాజకీయాలు చేయడంతో, జనాల్లోకి వెళ్లలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారం చేపట్టడం అంతా ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి తమిళనాడులో ఓ సారి డీఎంకే, మరోసారి అన్నాడీఎంకే పదవీ చేపడుతాయి.