BHNG: ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఏడో వార్డు బీసీ కాలనీలో శ్రీరామనవమి రోజున ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదగా ఇవాళ నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
SKLM: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనలతో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఆశ్రయించారు. PDPS పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయమైన ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసినట్లు మంత్రి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
AP: ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై 4 గంటలపాటు చర్చించనున్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే సర్కార్ కేంద్రానికి పంపనుంది.
AP: TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రేణులకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టి 44 ఏళ్లయిందని తెలిపారు. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది అని చెప్పారు. కార్యకర్తలు ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి తెలుగువాడినని గర్వంగా చాటాలని పేర్కొన్నారు.
AP: శ్రీవాణి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. శ్రీవాణి ట్రస్టుకు విరాళం, బ్రేక్ దర్శనం టికెట్‌కు ఏకకాలంలో పేమెంట్ చేసే సౌకర్యం కల్పించింది. రూ.10 వేలు విరాళం, బ్రేక్ దర్శనం రూ.500 ఒకేసారి చెల్లించే అవకాశం కల్పించింది. భక్తులు యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేసే సదుపాయం కల్పించారు.
NRPT: ధన్వాడ పీఎస్ సమీపంలో శుక్రవారం SI వెంకటేశ్ గౌడ్ ఆటో డ్రైవర్లతో ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, ఓవర్ లోడింగ్ చేయరాదని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు చేయాలని కోరారు.
ATP: విడపనకల్లు మండలం పాల్తూరులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పలువురు రైతుల గడ్డివాములు మంటల్లో చిక్కుకోగా, విషయం తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలు ఆర్పేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి చొరవతో భారీ ఆస్తి నష్టం తప్పింది.
TPT: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రారంభమైంది. సుమారు 1.60 లక్షల ప్యాకెట్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుంచి వచ్చిన 600 మంది శ్రీవారి సేవకులు ఇందులో పాల్గొంటున్నారు.
SRPT: అనంతగిరి మండల పాస్టర్స్ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జాన్ వెస్లీ, ఉపాధ్యక్షుడిగా ఆదాము, కార్యదర్శిగా శామ్యూల్ కిరణ్ ఎన్నికయ్యారు. కోర్ కమిటీ ఛైర్మన్ శ్రవణ్ కుమార్, డిసిప్లిన్ కమిటీ ఛైర్మన్ యేసయ్య సమక్షంలో ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు.
VSP: స్త్రీ శక్తి పథకం వల్ల ఆక్యుపెన్సీ 69% నుంచి 86%కు పెరిగిందని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. విశాఖ రూరల్ డిపోను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. బస్సులు అన్ని స్టేజీల్లో ఆగేలా చూడాలని, దూర ప్రయాణ బస్సులు సమయానికి నడపాలని ఆదేశించారు.
సత్యసాయి: జిల్లా పోలీస్ శాఖలో టీఏ (TA) బిల్లుల అవకతవకలకు పాల్పడిన సీనియర్ అసిస్టెంట్ ఎస్.విశ్వతేజను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నుంచి 2025 జనవరి వరకు సుమారు రూ. 8.90 లక్షల ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా తన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో తేలింది.
CTR: కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి సామాజిక సేవలో భాగంగా 30 మంది నిరుపేద వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 40 కుట్టు మిషన్లను అందజేశారు. స్వయం ఉపాధితో మహిళలు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణ పోచమ్మ చెరువులో శుక్రవారం వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. తాళ్ళగురిజాల SI రామకృష్ణ వివరాలు.. బూడిదగడ్డ బస్తీలో నివసించే శీలం రాజం గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేదు. ఈనెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, చెరువు వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగి చనిపోయాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
NZB: పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పలు కీలక అంశాలను లేవనెత్తారు. రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.