TPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లాకు చెందిన సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం మరియు సమన్వయం కోసం ఈ నియామకం చేపట్టినట్లు సమాచారం.
BPT: పర్చూరు మండలం దేవరపల్లిలో రూ. 35 లక్షల వ్యయంతో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం స్థానిక నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రహదారుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLR: మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులకు మండల సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది విద్యా సామగ్రి అందించారు. రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SRD: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందనీ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వెబ్‌సైట్ www. bse.telangana.gov.in నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో ఉంచామని, 8096958096 వాట్సాప్ నంబరుపై సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
PDPL: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బీ-ఫాం ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర శాసనసభ్యులతో కలిసి వేం నరేందర్ రెడ్డిను అభినందించారు.
KRNL: హోళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామంలోని బీసీ కాలనీలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల విన్నపం మేరకు సుమారు రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవాళ మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభం కావడంతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్థులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ గురువారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సీఎం YS జగన్ ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చారు. అయితే, జగన్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. కాగా, మరి కాసేపట్లో ఫంక్షన్ హాల్‌కు చేరుకుని వధూవరులను ఆశీర్వదించనున్నారు.
AP: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. 5.72 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలని ఎమ్మెల్సీ అరుణ్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్‌గా మారిందని YCP MLC సూర్యనారాయణ విమర్శించారు. ఇప్పటివరకు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎంత మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
RR: శంషాబాద్ విమానాశ్రయానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆయన హాజరుకానున్నారు.
SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ పద్మబాయి నర్సింగ్ రావు, 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, వార్డు నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
T20 WCలో టీమిండియా ఫీల్డింగ్ ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 13 క్యాచులు చేజార్చింది. ఇంగ్లండ్‌తో సెమీస్ ముంగిట దీనిపై బౌలింగ్ కోచ్ మోర్కెల్ మాట్లాడుతూ.. ఎవరూ కావాలని క్యాచులు వదిలేయరని, టోర్నీ ముందు నుంచే ఫీల్డింగ్‌పై టీమ్ చాలా ఫోకస్ చేసిందని పేర్కొన్నాడు. అనుకోకుండా చేజార్చిన క్యాచులపై సమాధానం ఇవ్వడం కూడా కష్టమేనని చెప్పుకొచ్చాడు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘నామోరే’ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను మార్చి 15న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
RR: షాద్‌నగర్ ఆర్డీవో సరితను ఆమె కార్యాలయంలో స్థానిక పట్టణ కౌన్సిలర్ శివ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా 26వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన విషయాలను ఆమెతో ప్రస్తావించినట్లు తెలిపారు. అర్హులైన వారికి మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున అందజేయాలని శివ ఆర్డీవో సరితను కోరారు.
TG: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మైహోం గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నిర్మించిన వెలమ సంక్షేమ భవనం, కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలమ కులస్తుల చిరకాల వాంఛ నెరవేరిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ను స్మార్ట్ టౌన్‌గా మారుస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
MDK: నర్సాపూర్ మండలంలో చిన్న చింతకుంటలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వారం క్రితమే పెళ్లయిన భవాని(19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకే ఆమె మృతి చెందినట్లు అత్తింటి వారు చెబుతుండగా, అదనపు కట్నం కోసం వేధించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.