ATP: జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం జిల్లా ఎస్పీ పి. జగదీష్ చొరవతో అనంతపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల బృందం పాల్గొని క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఇతర ఆరోగ్య తనిఖీలు చేశారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
KNR: హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
CTR: పుంగనూరు పట్టణం అంబేద్కర్ కూడలిలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు విరుపాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం సీఐ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల నుంచి పట్టణానికి నిత్యం ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారని, వేసవిలో వారు త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
KRNL: ఎమ్మిగనూరు పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని, ఆచూకీ తెలిస్తే రూరల్ పీఎస్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కె.శ్రీనివాసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం మహిళ బట్టలు ఉతకడానికి గుడేకల్లు దగ్గరలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన గల కాలువ వద్దకు వెళ్లిందన్నారు. బట్టలు ఉతుకుతూ కాలువలో పడి చనిపోయిందని తెలిపారు.
NZB: వేల్పూర్ మండలంలోని అక్లూర్, అమీనాపూర్ గ్రామాల్లో శనివారం ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్లూర్ సర్పంచ్ జనార్ధన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, అమీనాపూర్ సర్పంచ్ సౌందర్య పాల్గొని టీకా పంపిణీని ప్రారంభించారు.
ప్రకాశం: బేస్తవారిపేట గ్రామపంచాయతీలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్ను వసూలు ప్రక్రియను మార్చి 20 వరకు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బేస్తవారిపేట ఎంపీడీవో రంగనాయకులు పాల్గొన్నారు.
WGL: హైదరాబాద్ సచివాలయంలో శనివారం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై చర్చించినట్లు తెలిపారు. నర్సంపేట అభివృద్ధికి సహకరించాల్సిందిగా వేం నరేందర్‌ని ఎమ్మెల్యే కోరారు.
వైభవ్ సూర్యవంశీపై రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. అతిపిన్న వయసులోనే IPLలో అడుగుపెట్టి.. దూకుడైన ఆటతీరుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడని ప్రశంసించాడు. దేశవాళీ, అండర్-19 క్రికెట్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని గుర్తుచేశాడు. రాబోయే IPL అతడికి ‘లెర్నింగ్ సీజన్’ లాంటిదని.. అయితే, గత సీజన్ కంటే ఈసారి మెరుగ్గా రాణించే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.
ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లు అమెరికాలో ఉన్నాను. ఇండియా నుంచి ఎవరు వెళ్లిన జయరాం దగ్గరికి వెళ్తారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను అనేక దేశాల్లో నిర్వహించారు’ అని పేర్కొన్నారు.
అన్నమయ్య: చిట్వేల్ మండలంలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవోలు కాజా మొహిద్దిన్, ఈశ్వరయ్య తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 513 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, వైద్య సేవలు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కృష్ణా: జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈవో సుబ్బారావు తెలిపారు. శనివారం బందరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 148 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 21,296 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
NZB: ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన వివిధ వాహనాలకు ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. సుభాష్ నగర్‌లోని ఎక్సైజ్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలంలో పాల్గొనే వారు రూ. 5,000 డిపాడిట్ చెల్లించి ఎంట్రీ పాస్ పొందాలని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.
SRD: చరిత్ర కలిగిన పటాన్చెరులోని ఓ ప్రముఖ పెయింట్స్ పరిశ్రమ కార్మిక సంఘ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. ఇప్పటివరకు ఆధిపత్యం చూపిన CITUపై INTUC కార్మిక సంఘం విజయం సాధించింది. మొత్తం 278 ఓట్లు పోలవగా, INTUC తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన జి. సంజీవరెడ్డికి 142 ఓట్లు లభించాయి. CITU తరఫున పోటీ చేసిన చుక్క రాములు 134 ఓట్లు సాధించారు. దీంతో INTUC గెలుపు ఖాయమైంది.
E.G: రాజానగరం మండలం నరేంద్రపురం యూనిట్‌లో శనివారం రైతుల కోసం PMDS (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) కిట్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పంపిణీ చేయడానికి ఒక్కో కిట్‌లో 15 కిలోల చొప్పున మొత్తం 26 రకాల విత్తనాలతో 250 కిట్లు సిద్ధం చేశారు. ఈ కిట్లు PMDS పద్ధతిలో ఉపయోగపడేలా రూపొందించామని ప్రకృతి వ్యవసాయ అధికారి నీతు గ్రేస్ తెలిపారు.
కడప: నగరంలోని ప్రకాశ్ నగర్లో ఉన్న దాదాపు రూ. 30 కోట్ల విలువైన 22.5 ఎకరాల తమ పూర్వీకుల భూమిని టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కబ్జా చేయాలని చూస్తున్నారని అంబవరం సహదేవరెడ్డి ఆరోపించారు. ఈభూమిపై తమకే హక్కులు ఉన్నాయని, అధికార అండదండలతో తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.