నెల్లూరు రూరల్ పోలీసులపై టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు తీసుకెళ్లిన టీచర్‌ను వదిలేసి, పట్టించిన వారిపై కేసులు పెట్టడం ఏంటీ అని అడిగారు. 2వ డివిజన్ గుడిపల్లిపాడులో నిన్న జరిగిన ఘటన గురించి వివరించారు. పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్లను ప్రధానోపాధ్యాయురాలు ఇంటికి తీసుకెళ్తుండగా గ్రామస్తురాలు నాగభూషణమ్మ పట్టుకున్నారు. పట్టుకున్న ఆమెను పోలీసులు వేధించారు. విషయం తెలిసి నెల్లూరు రూరల్ స్టేషన్‌కు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేరుకున్నారు. కోడి గుడ్లు తీసుకెళ్లిన ప్రధానోపాధ్యాయురాలిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
లక్షల్లో జీతం
పేద పిల్లలకు పోషకాహారంగా అందించే కోడిగుడ్లను రూ.లక్ష జీతం తీసుకునే సర్కారీ టీచర్ ఇంటికి ఎత్తుకెళ్లడం ఏంటని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పిల్లలకు పెట్టకుండా తీసుకెళుతున్న 50 కోడిగుడ్లను నాగభూషణమ్మ బయటపెట్టిందని చెప్పారు. తిరిగి ఆ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడంతో నాగభూషణమ్మ, ఆమె కుమారుడు, ఆ సమయంలో అక్కడున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోరని సోమిరెడ్డి నిలదీశారు. దొంగలను పట్టుకోవడానికి మీరెవరు అని నాగభూషణమ్మను వేధించడం సరికాదన్నారు.
టీచర్‌కే పోలీసుల వత్తాసు
కోడిగుడ్లు ఎత్తుకెళ్లిన టీచర్‌పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. నెలకు రూ.లక్ష జీతం తీసుకునే ఆ టీచర్ పిల్లల నోటికాడి కోడిగుడ్లు తీసుకెళ్లొచ్చా.. దొంగను పట్టుకున్న వారిపై కేసు పెడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రైవేటు కేసు పెడతామని సోమిరెడ్డి స్పష్టంచేశారు. లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేస్తామని వివరించారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తామని చెప్పారు. రూ.లక్ష జీతం తీసుకుంటూ పిల్లల నోటికాడి గుడ్లను తన ఇంటికి ఎత్తుకెళ్లడం మాత్రం సరికాదన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దొంగే దొంగ అన్నట్టు ఉంది
ఆకలేసి అన్నం తినేందుకు దొంగతనం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. టీచర్ ఇలా చేయడం ఏంటని అడిగారు. దొంగతనం చేసిన టీచర్ కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు తీసుకుంటారట.. పట్టుకున్నవారు ఫిర్యాదు చేస్తే లెక్కచేయరట అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు.