విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. నాని సోదరుడు చిన్నికి విజయవాడ టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిన్ని సహా మరో నలుగురికి టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని ఇటీవల నాని స్పష్టంచేశారు. ఓ సందర్భంలో విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతానని నాని సంకేతాలను ఇచ్చారు. అక్కడినుంచి తాను పోటీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకటన చేయడంతో వివాదం నెలకొంది. గత కొంతకాలంగా టీడీపీ హై కమాండ్, చంద్రబాబుకు నాని దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ లోక్ సభ, విజయవాడ వెస్ట్ నుంచి తాము పోటీ చేస్తామని నేతలు ప్రకటన చేస్తున్నారు. బుద్దా వెంకన్న ఇవాళ (బుధవారం) మీడియాతో మాట్లాడారు. నానితో చిన్నికి భేదాభిప్రాయాలేనని తెలిపారు. అన్నదమ్ములకు వ్యక్తిగతంగా కక్షలు లేవన్నారు.
విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగే అంశంపై తన పేరు చెప్పి నాని మాట్లాడితేనే స్పందిస్తానని బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. అప్పటివరకు కామెంట్ చేయబోనన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు. పార్టీలో ప్రక్షాళన గురించి కేశినేని నాని అభిప్రాయంతో ఏకీభవిస్తానని తెలిపారు. పార్టీలో జరిగే/ జరుగుతున్న అన్ని అంశాలు చంద్రబాబు నాయుడుకు తెలుసు అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం అని ఆయన చెబుతుంటారని, అందరూ పార్టీ లైన్ మేరకు నడుచుకోవాలని కోరారు.
అంతకుముందు కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. తనకు అధినేత చంద్రబాబు సీటు ఇవ్వకున్నా ఏమీ కాదని, ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానన్నారు. తనను ప్రజలు పోటీ చేయమంటే బరిలో దిగుతానని వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ టికెట్‌పై కేశినేని బ్రదర్స్ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించారని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసమే విజయవాడ పార్లమెంట్ పరిధిలో చిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీపై కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చిచెప్పారు. నిజాయితీ గల వ్యక్తులకు టికెట్ ఇస్తేనే గెలుపు కోసం పనిచేస్తానని చెబుతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ఈసారి 25 వేల మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని నాని చెప్పారు. వెస్ట్ నుంచి పోటీ చేస్తానని బుద్దా వెంకన్న ప్రకటన చేయగా, నాని ఇండైరెక్టుగా అయ్యారు. ఆ వెంటనే బుద్దా వెంకన్న కూడా మాట్లాడారు. కానీ తన గురించి మాట్లాడితేనే స్పందిస్తానని వివరించారు. అన్నదమ్ముల విభేదాల గురించి మాట్లాడారు.