Ministers Harish Rao, Gangula Kamalakar:తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవల సచివాలయ ప్రారంభోత్సవం.. అంతకుముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తనను పిలవలేదని గవర్నర్ తమిళి సై ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రులు హరీశ్ రావు (Harish Rao), గంగుల కమలాకర్ స్పందించారు.
కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించాలని రాజ్యాంగంలో ఉందా అని మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించిన సమయంలో రాష్ట్రపతిని పిలిచారా అన అడిగారు. గవర్నర్‌గా.. మహిళగా తమిళి సై సౌందరరాజన్‌ను గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరికాదన్నారు.
మరో మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కూడా స్పందించారు. సీఎం కేసీఆర్ రాజకీయాలు చేసే గవర్నర్‌ను ఆహ్వానించరని కుండబద్దలు కొట్టారు. ఆకాల వర్షంతో రైతులు ఇబ్బంది పడుతుంటే కేంద్రం, గవర్నర్ ఏం చేస్తున్నారని అడిగారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాయాలని కోరారు. ఎఫ్‌సీఐ నిబంధనలు సడలించేలా ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణ ప్రజలు కట్టే జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుందని కామెంట్ చేశారు.
దేశానికి వచ్చే దేశాధినేతలను కలుసుకునే అవకాశం ఉంటుంది.. తెలంగాణ సీఎంను కలిసే అవకాశం ఉండదని నిన్న గవర్నర్ తమిళి సై కామెంట్ చేశారు. కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు.. తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ దగ్గర కావని చెప్పారు. గవర్నర్ చేసిన కామెంట్లపై మంత్రులు గట్టిగానే స్పందించారు.