సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కైట్ ఫెస్టివల్. ఇక సిటీలో అయితే మాములుగా ఉండదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. ఇప్పుడు కాలేజీల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీలో కూడా కైట్ ఫెస్టివల్ ఇవాళ (బుధవారం) జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల మైసమ్మగూడలో కైట్ రంగోలి నిర్వహించారు. వేడుకకు డీజే టిల్లు ఫేమ్, హీరో సిద్దు జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్‌గా విచ్చేశారు. వర్సిటీ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ తర్వాత డీజే టిల్లుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ అవుతుంది.
మంత్రి మల్లారెడ్డి చేసే సందడి వేరే లెవల్. మాస్ సాంగ్స్‌కు స్టెప్పులేసి ఆకర్షిస్తుంటారు. మల్లారెడ్డి వర్సిటీలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. హీరో సిద్ధు స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. డీజే టిల్లు సినిమాలో మాస్ సాంగ్ అయిన టైటిల్ సాంగ్‌కు కాలు కదిపారు. డీజే టిల్లు పాటకు హీరో సిద్ధు మంత్రి మల్లారెడ్డితో స్టెప్పులు వేయించారు. వారి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. మంత్రి మల్లారెడ్డి ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. ఏ వేదిక అయినా సరే తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమయం దొరికితే చాలు తనలోని కళను బయటకు తీస్తున్నారు. ఏ వేదిక అయినా సరే స్టెప్పులు వేసి.. హోరెత్తిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఓపెన్ చేసే సందర్భంలో అందరికీ చాయ్ ఇచ్చారు. అక్కడున్న నేతలంతా జై మల్లన్న జై జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు.
అంతకుముందు కంటివెలుగు-2 గురించి మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. కంటి వెలుగు పథకాన్ని గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ఎక్కించాలని కోరారు. అద్బుతమైన పథకాలు ప్రవేశపెట్టడం సీఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రజల బాగోగుల కోసం పరితపించే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మనకు అండగా ఉన్నారని వివరించారు. కంటివెలుగు-2 ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని వివరించారు. మల్లారెడ్డి వైఖరిపై ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించారు.
మైనంపల్లి హన్మంతరావు నివాసంలో కుత్బుల్లాపూర్ వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మీట్ అయ్యారు. తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులపై చెప్పకుండా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. పదవులు, అభివృద్ది పనుల గురించి చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్పుపై ఈ భేటి జరిగిందని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్‌కి చెందిన రవి యాదవ్‌ను తప్పించి మేడ్చల్‌కు చెందిన భాస్కర్ యాదవ్‌ను నియమించడంతో ఒక్కసారిగా అసంతృప్తి బయటపడింది. సమావేశంలో మంత్రి మల్లారెడ్డి తీరుపై చర్చించారు. తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయం తెలియజేశారని సమాచారం.