బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది.
ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
భవిష్యత్తులో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని రాజా సింగ్ కు కోర్టు సూచించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయవద్దని సూచించింది. అంతేకాకుండా మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని కూడా రాజా సింగ్ కు కోర్టు షరతులు విధించింది. తక్షణమే రాజా సింగ్ ను విడుదల చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.