»Uttarpradesh Man Steals Shivling From Temple On Not Finding Bride Despite Prayers
Uttarpradesh: శివుడికి ఎన్ని పూజలు చేసినా పెళ్లి కాలే..కోపంతో శివలింగాన్ని దొంగిలించిన వ్యక్తి!
శివాలయంలో పూజలు చేసే వ్యక్తి తనకు పెళ్లి కావాలని మొక్కుకున్నాడు. అందుకోసం రోజూ ప్రదక్షిణలు చేస్తూ ప్రార్థించేవాడు. నెల రోజుల తర్వాత కూడా తనకు పెళ్లి సెట్ కాలేదు. పెళ్లికుమార్తె దొరక్కపోవడంతో ఆ వ్యక్తి గుడిలోని శివలింగాన్ని దొంగిలించాడు.
ఓ వ్యక్తి తనకు పెళ్లి కావాలని శివునికి (Lord Shiva) ఎన్నో పూజలు చేశాడు. దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. తనకు పెళ్లికుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే (Shivalingam) దొంగిలించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే వ్యక్తి రోజూ భైరవ బాబా ఆలయానికి (Bhairava Baba Temple) వెళ్లి పూజలు చేసేవాడు. తనకు త్వరగా పెళ్లి కావాలని, తనను ఎంతో బాగా చూసుకునే అమ్మాయి దొరకాలని ప్రతి రోజూ ప్రార్థనలు చేసేవాడు. అలా ఒక నెల రోజుల పాటు ఆ శివుని దేవాలయంలో పూజలు చేస్తూ వచ్చాడు. అయితే చివరకు తనకు అమ్మాయి దొరక్కపోవడంతో చోటూ తీవ్ర అసహనానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో చోటూ (Chotoo) తన దేవుని మీద కోపం పెంచుకున్నాడు. ఆగస్టు 31న ఆ వ్యక్తి ఆలయంలోని శివలింగాన్ని అపహరించాడు. దేవాలయంలో శివలింగం కనిపించకుండా పోవడంతో మిగిలిన భక్తులంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు పోలీసులు చేరుకుని భక్తులను విచారించారు.
అయితే ఆలయ పరిసరాల్లో చోటూ కాస్త అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు చోటూను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తన నేరాన్ని చోటూ అంగీకరించాడు. తాను ఎన్ని పూజలు చేసినా అమ్మాయి దొరకలేదని, అందుకే విసుగుచెంది తాను శివలింగాన్ని అపహరించినట్లుగా చోటూ తెలిపాడు. ఆ తర్వాత ఆలయానికి దగ్గర్లోని చెట్ల పొదల్లో దొరికిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆలయంలో ఉంచారు. చోటూ (Chotoo) ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.