యూపీ ప్రజలకు సీఎం యోగి (CM Yogi) ఆదిత్య నాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా రాష్ట్రంలో ఉన్నప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఉజ్వల యోజన (Ujjwala Yojana) కింద గ్యాస్ కనెక్షన్ ఉన్నవారందరికీ ఈ దీపావళి కానుక కింద ఒక గ్యాస్ సిలిండర్‌ను ఫ్రీగా అందిస్తామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. తాజాగా బులంద్‌షహర్(Bulandshahr)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు యోగి శంకుస్థాపన చేశారు.
అయితే దేశంలో గ్యాస్ సిలిండర్ (Gas cylinder) ధరలు అమాంతం పెరిగి రూ. 1000 దాటిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా దగ్గర పడటంతో ఇటీవల కేంద్రం భారీ ఊరటను కల్పించింది. దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన పథకం కింద బీపీఎల్ (BPL) కుటుంబాలకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. దీని ద్వారా ఇచ్చే సిలిండర్ ధరను రూ.300 తగ్గిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రకటించింది. దీంతో లబ్ధిదారులకు కాస్త ఊరట కలిగిందని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో యూపీలోని ప్రజలకు ఒక సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం అక్కడి పేదలకు లాభించే అంశం.