»Diamond Hunting Up To 16 Km People Coming To Pushpagiri Field
Kadapa: 16 కిలోమీటర్ల వరకూ వజ్రాల వేట.. పుష్పగిరి క్షేత్రానికి పోటెత్తిన జనం
పుష్పగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్షేత్రం వద్ద వజ్రాలు దొరికాయనే ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. క్షేత్రం చుట్టూ వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు జనాలు పోటెత్తుతున్నారు. వల్లూరు మండలం దక్షిణ కాశీగా పేరుపొందిన పుష్పగిరి క్షేత్రం దరిదాపుల్లో భారీ ఎత్తున వజ్రాలు లభించాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు. కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ వద్దకు ఉదయాన్నే చేరుకుని వజ్రాల కోసం జల్లెడ పడుతున్నారు. కొండ చుట్టూ అంత దూరం వరకూ కూడా వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తున్నారు.
కొండ కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఈ గ్రామానికి కొండకు మధ్యలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది కూడా పాము ఆకారంలో ఉంది. అంతేకాకుండా పుష్పగిరికి సమీపంలో పాపాఘ్ని నది, కుమ్ముద్వతి, వల్కల, మాండవి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. పంచ నది క్షేత్రమైన ఈ ప్రాంతంలో చెన్నకేశవ ఆలయం, సంతాన మల్లేశ్వర ఆలయాలు ఉన్నాయి.
జగద్గురువు ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించడంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పుష్పగిరి కొండలో వజ్రాలు దొరికాయని ప్రచారం జోరుగా సాగింది. అందుకే కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వజ్రాల కోసం పుష్పగిరి కొండ చుట్టూ ప్రజలు తిరుగుతూ జల్లెడపడుతున్నారు.