»Good News For Those Going To Tirumala Srivari Darshan Within An Hour
Tirumala: తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్..గంటలోనే శ్రీవారి దర్శనం
తిరుమలకు వెళ్లేవారికి గంటలోపే శ్రీవారి దర్శనం అవుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా డైరెక్ట్‌గా క్యూలైన్లలోకి పంపడం వల్ల వేగంగా దర్శనం పూర్తవుతోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల (Tirumala)కు వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. తిరుమలలో నిన్నటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Srivari Navaratri Bramhotsavams) ప్రారంభం అయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వీకెండ్లో కూడా భక్తులు నేరుగా క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కేవలం గంట వ్యవధిలోనే శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వారాంతంలో కూడా ఇలా భక్తుల రద్దీ లేకపోవడంతో భక్తుల దర్శనం సులభతరం అయ్యింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా క్యూలైన్లలోకి పంపి దర్శనం చేయిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై ద్వారకా కృష్ణుడి అవతారంలో భక్తులకు కనిపించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఆలయ మాఢవీధుల్లో శ్రీవారి చిన్నశేష వాహనంపై విహరించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు.
అక్టోబర్ 23వ తేది వరకూ జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ (TTD) పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, మహారథ ఉత్సవాలు ఉండవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 19వ తేదిన గరుడ వాహనం సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ సామాన్యులకు పెద్ద పీట వేస్తోంది. ఉత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిని డైరెక్ట్‌గా క్యూలైన్లలోకి పంపుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్ల ద్వారా గంటలోనే దర్శనం పూర్తవుతుండటంతో ఒక్కరోజులోనే ఎక్కువ మందికి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తోంది.