»Srivari Navratri Brahmotsavam From Today The Programs To Be Held Till 23
TTD: నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..23 వరకూ జరిగే కార్యక్రమాలివే
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 23న చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
తిరుమల (Tirumala) తిరుపతిలో నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Srivari Navaratri Bramhotsavams) ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 23వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. చాంద్రమానం ప్రకారంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తున్న నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) నిర్వహిస్తుంది.
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధానంగా అక్టోబర్ 19వ తేదిన గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం వంటివి టీటీడీ నిర్వహించనుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వాహన సేవ 8 నుంచి 10 గంటల వరకూ సాగుతుంది. అలాగే రాత్రి వాహన సేవ 7 నుంచి 9 గంటల వరకూ జరుగుతుంది. గరుడ వాహన సేవను మాత్రం రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకూ టీటీడీ (TTD) నిర్వహించనుంది.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే: అక్టోబర్ 15న బంగారు తిరుచ్చి ఉత్సవం, పెద్దశేషవాహన సేవ అక్టోబర్ 16న చిన్నశేషవాహన సేవ, హంస వాహన సేవ అక్టోబర్ 17న సింహ వాహన సేవ, ముత్యపుపందిరి వాహన సేవ అక్టోబర్ 18న కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ అక్టోబర్ 19న మోహినీ అవతారం, గరుడ వాహన సేవ అక్టోబర్ 20న హనుమంత వాహన సేవ, పుష్పకవిమాన సేవ, గజవాహన సేవ అక్టోబర్ 21న సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ అక్టోబర్ 22న స్వర్ణరథం, అశ్వవాహన సేవ అక్టోబర్ 23న చక్రస్నానం ఉంటుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు అంటే అక్టోబర్ 23వ తేదిన ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. శ్రీవారికి పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేసి చక్రస్నానం చేయిస్తారు. చివరిరోజు అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొంది బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.