గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం ఎంతో దురదృష్టకరమన్నారు. ఈ జాతి గొప్పదనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అన్నారు ఆయన.
అబద్ధపు పునాదుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం విధానాలు చూస్తుంటే రాజ్యాంగస్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పబ్లిక్ సెక్టార్ ని పెంచుకుంటూ పోతే, బీజేపీ మాత్రం దానిని ప్రయివేటు పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తుండడంతో రిజర్వేషన్లు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బిజెపి తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మండిపడ్డారు. కెసిఆర్ కూడా ఏమ్ తక్కువ కాదన్నారు. ఓ పార్టీలో గెలిచి, రాజీనామా చేయకుండానే అధికార మక్కువతో మరో పార్టీలోకి వెళ్తే అత్యాచారం, హత్య కేసులో వేసినట్టుగా ఉరిశిక్ష వేయాలని షాకింగ్ కామెంట్స్ చేసారు.