స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఓ ప్రత్యేకమైన వీడయోను కూడా మోడీ విడుదల చేశారు. వీడియోలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ తనకు మార్గదర్శకుడని, యువతకు ఆయన మార్గనిర్దేశకుడని, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తన రోల్ మోడల్ సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు.
తాను యువ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ ను ఎంతగానో ఆరాధించేవాడినని, అప్పట్లో డైరీలో రాసుకున్న కొన్ని సూక్తులను చూపించారు. తాను బీజేపీ కార్యకర్తగా, బీజేపీ జాతీయ కార్యదర్శిగా, గుజరాత్ సీఎంగా ఉన్న టైంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అలాగే సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ గా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా చూపించారు. కర్తవ్యపథ్ ప్రారంభోత్సవం గురించి వివరించారు.