సర్జరీలు చేసేటప్పుడు కూడా హిజాబ్ (Hijab) ధరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఏడుగురు ముస్లిం ఎంబీబీఎస్ విద్యార్థినులు కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. తమ మతాచారాలను పాటించేందుకు ప్రకారం హిజాబ్‌ను అన్ని సందర్భాల్లోనూ ధరించడం తప్పనిసరి అని అన్నారు. ఆసుపత్రి (hospital), శస్త్ర చికిత్సల గదులలో పాటించవలసిన నిబంధనలను అనుసరిస్తూ, తమ మతాచారాలను పాటించడం తమకు కష్టంగా ఉందని వెల్లడించారు. విదేశాల్లో యూనిఫార్మ్ హెల్త్ వర్కర్స్ (Health workers) ధరిస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ దుస్తులను తమకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న ఈ విద్యార్థినులు రాసిన లేఖలో, విదేశాల్లో లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. వీటివల్ల తాము హిజాబ్ ధరించడానికి, అదే సమయంలో స్టెరైల్ ప్రికాషన్స్ (Sterile Precautions) తీసుకోవడానికి తమకు అవకాశం ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లైనెట్ మోరిస్ (Lynette Morris) మాట్లాడుతూ, విద్యార్థినుల డిమాండ్‌పై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ డిమాండ్‌ను ఇప్పటికిప్పుడు ఆమోదించడం సాధ్యం కాదన్నారు. ఆపరేషన్ థియేటర్ల(Operation theaters)లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. రోగుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. తాను ఒక్కడినే దీనిపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్నారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ 10 రోజుల్లోగా ఓ పరిష్కారాన్ని సూచిస్తుందన్నారు.