తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈనేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కొన్నారు. కాగా… తాజాగా విరాళాలు ఇచ్చిన నేతలుకు కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌కు ఈడీ నోటీసులు పంపింది. దాంతో నోటీసులు అందుకున్న వీరందర్నీ అధిష్టానం ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విచారణకు ముందే ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో ఈ ఐదుగురు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కొందరు నిన్న సాయంత్రమే ఢిల్లీకి వెళ్లగా.. మరికొందరు ఇవాళ వెళ్లారు.
ఢిల్లీలో ఆడిట్ పరంగా, న్యాయపరంగా చర్చించే అవకాశం ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఈడీ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలనే వాటిపై చర్చించడానికే నోటీసులు అందుకున్న వారిని ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఈడీ విచారణ ఎదుర్కొంటుండగా.. తాజాగా కాంగ్రెస్ నేతలకు పిలుపు రావడంతో తెలంగాణ రాజకీయ పార్టీ నేతల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.