యువత ఆలోచన ధోరణి మారుతోంది. చదువుకుని ఉద్యోగం చేయడమనేది పాత పద్ధతిగా భావిస్తున్నది. సోషల్ మీడియా సహాయంతో తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త పనులతో అటు ఆదాయం.. ఇటు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. దెబ్బకు స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి బిహార్ కు చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్ పుత్. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఏకంగా రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు.
బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ లోని జసోయా ప్రాంతానికి చెందిన హర్ష్ న్యూస్ రిపోర్టర్ గా పని చేసేవాడు. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. రకరకాల సమస్యలపై కొంత వినూత్నంగా కామెడీని జోడించి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ధాకడ్ అనే పేరుతో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ సంచలనంగా మారాడు. దీంతో అతడి దశ తిరిగింది. ఆయన వీడియోలకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. అతడి చానల్ ను 33 లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఈ చానల్ ద్వారా హర్ష్ నెలకు రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
ఆ వచ్చిన సంపాదనతోనే రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అంతటి విలాసవంతమైన కారును తన ఇంటి వద్ద పశువుల పాక దగ్గర నిలిపి ఉంచుతుండడం గమనార్హం.