గుజరాత్(Gujarat)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్డీఎఫ్, ఇండియన్ ఆర్మీ, కోస్ట్ గార్డ్ దళాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ఈ సంఘటనపై గుజరాత్ హోంమంత్రి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన 6 నెలల పాటు మరమ్మత్తులు చేసిన అనంతరం అక్టోబర్ 26న పున: ప్రారంభం అయింది. ఆదివారం సాయంత్రం ఈ వంతెన కూలింది. ఆ సమయంలో అక్కడ 400 నుంచి 500 మంది వరకు ప్రజలు ఉన్నారు. వారంతా నదిలోకి పడిపోయారు. కొంత మంది స్వయంగా బయటపడ్డారు. అనేక మందిని సహాయ బృందాలు కాపాడాయి. ప్రస్తుతం డ్రోన్లను వినియోగించి సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
పలువురు ప్రముఖులు ఈ సంఘటన పట్ల తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ బాధను పంచుకుంటున్నారు.మరికొందరు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.