జనాలు పూర్తిగా ముఖం వాచిపోయి ఉన్నారు. పవర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్ళి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన అభిమానులు ఎంతో గర్వపడినా, సినిమా పరంగా వాళ్లు ఫీలైనంత లోటు ప్రపంచంలో మరెవ్వరూ ఫీలై ఉండరు. మిగతా హీరోల సినిమాలు వచ్చేస్తుంటే, హిట్లు అయిపోతుంటే, రికార్డులు సెట్ చేస్తుంటే వాళ్ళు ఆసాంతం నిరాశకు లోనయ్యారనే చెప్పాలి. కాకపోతే వాళ్ళకి ఒకే ఒక్క ఆశ. హరిహరవీరమల్లు వస్తుంది, పవర్ స్టార్ ప్రభంజనం మళ్ళీ జూలు విదిలిస్తుంది, తాము కూడా కాలర్ ఎగరేసుకోవచ్చని గంపెడాశతో ఇన్నాళ్ళూ ఉన్నారు.
కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, తర్వాత అధికార స్వీకరణ వీటివల్ల పవన్ అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేయలేకపోయారు. ఆయనతో ఖుషీ నుంచి ప్రయాణం చేస్తున్న భారీ చిత్రాల నిర్మాత ఎఎం రత్నం నిర్మాత కాబట్టి ఈ సినిమా బతికి బట్ట కట్టింది. పవన్ సినిమాల్లోనే వీరమల్లు అతి భారీ బడ్జెట్‌తో నిర్మాణానికి తయారైంది. సగం పూర్తవగానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మొలవరకూ కూరుకుపోయి రత్నానికి డేట్స్ సర్దలేకపోయారు. కానీ రత్నం కాబట్టి ఆకాశమంత ధైర్యంతో కొండంత బరువును నెత్తిమీద మోస్తూ, ఓ పక్కన విమర్శలు ఎదుర్కొంటూ, అవమానాలు భరిస్తూ కూడా మౌనంగానే పవన్ డేట్స్ కోసం నిరీక్షిస్తూ ముందుకు సాగారు.
మొత్తానికి పవన్ వీరమల్లు సినిమా పూర్తవడానికి కావాల్సిన ఫైనల్ డేట్స్ ఇచ్చారు. సినిమా ప్రారంభమైన కొన్నాళ్ళకే తొలి దర్శకుడు క్రిష్ ప్రాజెక్టుకు ఆయన సొంత కారణాల వల్ల దూరమైపోయారు. తర్వాత ఎవరు మెగాఫోన్ పట్టుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆయన కుమారుడు జ్యోతికృష్ణ ముందుకొచ్చి, అ పెనుభారాన్ని భుజాలమీదకెత్తుకుని వీరమల్లు సినిమాని దిగ్విజయంగా పూర్తి చేశాడు. కానీ మళ్ళీ రిలీజ్ డేట్స్ విషయంలో తబ్బిబ్బు మొదలైంది. ప్రకటించిన ప్రతీ సారీ ప్రయత్నం వికటించి, డేట్స్ మారుతూ వచ్చాయి. అప్పుడు మళ్ళీ రత్నంకి, జ్యోతికృష్ణకి అగ్నిపరీక్షే ఎదురైంది. అయినా వాళ్ళిద్దరూ ఏ మాత్రం సడలకుండా నిలబడి అన్నిటినీ ఎదుర్కొన్నారు. ఓటిటివాళ్ళ చేతుల్లో విడుదల తేదీలు చిక్కుకున్న నేపథ్యంలో ప్రతీసారీ దర్శకనిర్మాతలకి చుక్కే ఎదురైంది. చిట్టచివరికి డేట్ లాక్ అయింది. జూలై 24 ఫిక్స్ అయింది.
దరిమిలా, ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా రత్నం అనౌన్స్ చేశారు. అదే జూలై 3. అంటే ఇవ్వాళే. అభిమానుల ఆత్రానికి, ఎలా ఉంటుందోననే ఆందోళనకి అంతే లేదు. ఎట్టకేలకు ఈరోజు వీరమల్లు మూడు నిమిషాల ట్రైలర్ విడుదలై, వీరవిహారం సృష్టించింది. ఒక్కసారిగా అభిమానులు అలసటలో, ఆనందం తెచ్చిన బడలికతో కూలబడిపోయారు. ట్రైలర్ చూసి అందరికీ కళ్ళు తిరిగాయి. ప్రతీ ఫ్రేమ్ షేక్ అడించింది. ప్రతీ షాట్ షాక్‌కి గురి చేసింది. మూడు నిమిషాలే అయినా మూడు గంటల సినిమాలా మరో లోకంలోకి తీసికెళ్ళింది. పాన్ ఇండియాలో విడుదలవుతున్న హరిహరవీరమల్లు సినిమా దిక్కుల్ని బద్దలు కొట్టేసింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ జస్ట్ సినిమా హీరో మాత్రమే కాదు. పెద్ద ప్రజానాయకుడు. పైగా ఆంద్రప్రదేశ్ డిప్యూటీ ఛీఫ్ మినిష్టర్. మామూలు హీరో అంటేనే బోలెడు అప్పోజిషన్. దానికి తోడు ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి మరీ డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తికి మరెంత అప్పోజిషన్ ఉంటుంది? కానీ అభిమానుల పుణ్యం పుచ్చింది. నిర్మాత రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణల సుదీర్ఘ పోరాటం బాగా పండింది. ట్రైలర్ చూస్తే దిమ్మ తిరిగిపోయేట్టుంది. దెబ్బకి నోళ్ళు వెళ్ళబెట్టాల్సివచ్చింది అందరికీ.
దర్శకనిర్మాతలపైన ప్రపంచం నలుమూలల నుంచి అభినందనల పూల వర్షం కురుస్తోందిప్పుడు. సినిమా మీద అమాంతంగా అంచానాలు పెరిగిపోయి, అంబరాన్ని తాకుతున్న వేళ ఇది. మామూలుగానే సినిమా ఓ మాదిరిగానే ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాలు ఊపేస్తాయి. అలాంటిది భారీ సెట్లు, పీరియడ్ ఎట్మాస్ఫియర్….కొత్తగా ఉంటుంది సినిమా.
పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభమైన కొన్నాళ్ళకే ఖుషీ లాంటి ల్యాండ్ మార్క్ హిట్ ఇచ్చిన నిర్మాతే రత్నం. ఇప్పుడు మళ్ళీ పవన్ అభిమానులకి పాన్ ఇండియా హిట్ ఇవ్వబోతున్నది కూడా ఆయనే కావడం కేవలం యాధృచ్ఛికమే అయినా , చాలా అపురూపమైన విషయం.