కొంత గ్యాప్ తర్వాత ‘జిన్నా’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు విష్ణు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు . సినిమా టాక్ బాగున్నా.. ముందు నుంచి నెగెటివ్ ప్రచారం జరగడం.. పైగా నాలుగు సినిమాలకు పోటీగా రావడంతో అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో విష్ణు(vishnu) నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే చర్చ జరుగుతోంది. మళ్లీ కామెడీనే నమ్ముకుంటాడా లేక కొత్తగా ట్రై చేస్తాడా అనే టాక్ నడుస్తోంది.
ఇప్పటికే శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్‌గా ‘ఢీ అంటే ఢీ’ ప్రకటించాడు విష్ణు. ‘జిన్నా’ తర్వాత ఈ సీక్వెల్ ఉంటుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడట విష్ణు. ‘జిన్నా’ మూవీలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేశాడు ప్రభు దేవా(Prabhu Deva). ఆ సమయంలోనే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని టాక్. గతంలో తెలుగులో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా.. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేశారు.
వాటిలో సౌత్ సినిమాల రీమేక్సే ఎక్కువగా ఉన్నాయి. అయితే గతేడాది సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘రాధే’ సినిమా తేడా కొట్టింది. దాంతో మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు ప్రభుదేవా. కానీ ఇప్పుడు విష్ణుతో సినిమా ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే ప్రభుదేవా ఎక్కువగా రీమేక్ కథలపైనే డిపెండ్ అవుతుంటాడు. ఈ నేపథ్యంలో సొంత కథతో సినిమా చేస్తాడా.. లేక విష్ణుతో కూడా ఏదైనా రీమేక్ చేస్తాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.