Megastar chiranjeevi: స్వయంకృషితో ఎదిగిన శిఖరం ‘చిరంజీవి’..హ్యాపీ బర్త్ డే మెగాస్టార్
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్ అయిన చిరంజీవికి 'హిట్ టీవీ' తరపున జన్మదిన శుభాకాంక్షలు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి ప్రస్థానాన్ని మొదలుపెట్టిన హీరో చిరంజీవి. నటుడిగా తన కెరీర్ ప్రారంభించి నేడు మెగాస్టార్ అయ్యారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని తెలుగు ఇండస్ట్రీ రారాజుగా వెలుగొందుతున్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) జన్మదినం. 1955లో ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో పుట్టారు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి చేసి 1976లో చెన్నైకి వెళ్లారు. అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నారు.
చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. 1976లో చెన్నైకి వెళ్లిన చిరంజీవి అక్కడే మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నారు. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా కంటే ముందుగా ప్రాణం ఖరీదు అనే మూవీ విడుదలైంది. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు అనే సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు లభించింది. హీరోగానే కాకుండా అటు విలన్ గాను చిరంజీవి నటించి మెప్పించారు.
1979లో ‘ఐ లవ్ యు’ అనే సినిమాలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారు. 1979లోనే చిరంజీవి నటించిన 8 చిత్రాలు రిలీజ్ కావడం విశేషం. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు రాణిస్తున్న సమయంలో కూడా చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పట్లో బ్రేక్ డాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి పెట్టింది పేరు. ఆయన స్టెప్పులకు ఊగని ప్రేక్షకులు అంటూ ఎవ్వరూ ఉండేవారు కాదు. యాక్షన్ హీరోగానే కాకుండా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలోనూ కామెడీ పాత్రలో నటించారు.
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి పొందారు. 2001లో శ్రీమంజునాథ సినిమాలో శివుడిగా, 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో శివుడిగా కనిపించి మెప్పించారు. తాజాగా చిరంజీవి (Megastar chiranjeevi) భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.