ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కోసం విలన్‌గా స్టార్ హీరో ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత మాసివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 31వ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు తారక్. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ‘సలార్’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత.. వచ్చే ఏడాది సమ్మర్లో ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విలన్ గురించి చర్చ జరుగుతునే ఉంది. ఇందులో ఓ స్టార్ హీరోని విలన్‌గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలొస్తునే ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ను ఎన్టీఆర్‌కు విలన్‌గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ అదే పనిలో ఉన్నాడని.. ఇప్పటికే విక్రమ్‌ను సంప్రదించినట్లుగా సమాచారం. అయితే విక్రమ్ విలన్‌గా ఒప్పుకుంటాడా.. అనేదే సందేహమే. అసలు ఇలాంటి వార్తల్లో నిజమెంత తెలియదు గానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం.. సిల్వర్ స్క్రీన్ చిరిగిపోవడం పక్కా అని చెప్పొచ్చు. నటన విషయంలో ఎన్టీఆర్, విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఇద్దరు తలపడితే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏదేమైనా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్.. విలన్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేం.