సోషల్ మీడియాలో ఆర్సీ 15 లీక్డ్ ఫోటోలు ఇంకా వైరల్ అవుతునే ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ పై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆర్సీ 15 టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. నిర్మాత దిల్ రాజు కూడా.. తన బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా కావడంతో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాను ముందుగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. కానీ విజయ్ ‘వారసుడు’ ముందుకు రావడంతో.. 2023 సమ్మర్లో ఆర్సీ15 రిలీజ్ చేయబోతున్నారని వినిపించింది. ఇక ఇటీవల ఏకంగా 2024 సంక్రాంతికి రాబోతోందనే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు 2023 దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే కాస్త ముందుగానే ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చెప్పారట శంకర్. కానీ దిల్ రాజు.. దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే.. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఆర్సీ 15 రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
ఇది కూడా చూడండి: ప్రభాస్-మారుతి డేట్ ఫిక్స్ చేశారా!?