2023 సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ సినిమా ‘వారిసు’.. తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే వారసుడు డబ్బింగ్ సినిమా కావడంతో.. థియేటర్ల ఎంపికలో రచ్చ జరుగుతోంది.
నిర్మాత దిల్ రాజు.. తెలుగు సినిమాల రేంజ్లో తమిళ్ సినిమాకు థియేటర్లు కేటాయిస్తున్నాడనే వాదనతో.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగు సినిమా నిర్మాతల మండలిపై మండి పడుతోంది తమిళ సినీ వర్గం. ఈ క్రమంలో దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్‌కు వార్నింగ్ ఇవ్వడం.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విజయ్ లాంటి స్టార్ హీరో తెలుగులో పెద్ద నిర్మాతకు డేట్లు ఇచ్చి సినిమా చేస్తున్నాడని.. కాబట్టి వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వలని..
ఒకవేళ ఈ సినిమాకు థియేటర్లు తక్కువగా ఇస్తే.. ఆ తర్వాత పరిణామాలు వారసుడుకు ముందు, ఆ తర్వాత అన్నట్లు ఉంటుందని హెచ్చరించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమిళంలో తెలుగు సినిమా పరిస్థితి మారుతుందని అన్నాడు లింగుసామి. దాంతో ఆయనపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు తెలుగు ఆడియెన్స్.
వరుస ఫ్లాపుల్లో ఉన్న మీకు.. తమిళ్లో ఎవరు నమ్మలేదని, ఏ హీరో అవకాశం ఇవ్వలేదని.. కానీ తెలుగు హీరో రామ్ ‘ది వారియర్’ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడని కామెంట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మాకే వార్నింగ్ ఇస్తావా.. అని మండి పడుతున్నారు. మరి వారసుడు వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.