ఎన్నడూ లేని విధంగా ఈ సారి మన ఇండియన్ సినిమాలను తెగ ఊరిస్తోంది ఆస్కార్ అవార్డ్. గత కొద్ది రోజులుగా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ పక్కా అంటూ.. హాలీవుడ్ ప్రిడిక్షన్స్ చెబుతూ వస్తున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ లభిస్తుందా.. లేదా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ నాటు నాటు, ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ కోసం పోటీ పడుతుంది ఆర్ఆర్ఆర్. ఈ నెలలోనే ఆస్కార్ నామినేషన్లు ఫైనల్ అవనున్నాయి. దాంతో ఆస్కార్‌కు రెండు అడుగుల దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. అయితే ఈ సినిమాతో పాటు ఆస్కార్ రేసులో ఇండియా నుంచి అఫిషీయల్‌గా ‘చెల్లో షో’.. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ సినిమా ‘కాంతార’ కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. రెండు విభాగాల్లో ఈ సినిమా అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతోంది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు విభాగంలో ‘కాంతార’కు అర్హత లభించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘కాంతార’ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కు అర్హత లభించినందుకు ఆనందంగా ఉంది.. ఇది మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం.. అందుకోసం ఆతృతగా ఉన్నాం’ అని పేర్కొంది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి కూడా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక కాంతార కూడా ఆస్కార్ బరిలో నివడంతో.. ఆర్ఆర్ఆర్ తర్వాత సౌత్ నుంచి అర్హత సాధించిన సినిమాగా కాంతార నిలిచింది. మరి ఈ చిత్రం ఆస్కార్‌కి షార్ట్ లిస్ట్ అవుతుందో లేదో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.