ప్రముఖ నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. మయోపైటిస్ కారణంగా ఆమె చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం శాకుంతలం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాటలకు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తాను మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు భారత్ వచ్చి, నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నదని, ఈ విషయం తనతో చెబితే, తాను శాకుంతలం కథ చెప్పానని, పురాణాల్లోని ఇలాంటి అద్భుత కథలను ఇప్పటి వాళ్లకు చెబితే బాగుంటుందని చెప్పడంతో పాటు శకుంతల పాత్రకు సమంత అయితే బాగుంటుందని భావించామని, ఆమెకు కథ చెప్పడంతో నచ్చి చేశారని అన్నారు. ఒక్క హీరోయిన్ను నమ్మి దిల్ రాజు కోట్లు పెట్టారని, అందుకు థ్యాంక్స్ అన్నారు. అక్కడే ఉన్న సమంత కన్నీరు పెట్టుకున్నారు.
ఆ తర్వాత సమంత మాటలు అందరినీ కదిలించాయి. తాను ఎంతో ఓపిక తెచ్చుకొని శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని, ఇక్కడ ఇంత ప్రేమ దొరుకుతుందని తాను అనుకోలేదన్నారు. తాను జీవితంలో ఎన్ని బాధలు భరించినా సినిమా పైన మాత్రం ప్రేమను వదులుకోలేదన్నారు. శాకుంతలం సినిమా తర్వాత నాపై మీ ప్రేమ మరింత పెరుగుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా తాను ఊహించుకున్నట్లు సినిమా రావాలని భావిస్తారని, కానీ కొన్నిసార్లు మాత్రమే ఊహను దాటి ఎక్స్ట్రా మేజిక్ జరుగుతుందన్నారు. నేను ఈ సినిమా చూశాక అదే ఫీల్ అయ్యానని సమంత చెప్పారు.
సినిమా చాలామందికి జీవితంలో ఓ భాగమని, గుణశేఖర్‌కు మాత్రం సినిమానే ఓ జీవితం అన్నారు. ప్రతి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారన్నారు. మాకు దిల్ రాజు ఎంతో అండగా నిలబడ్డారన్నారు. సినిమాను నేను ఎంత ప్రేమిస్తానో.. నన్ను సినిమా కూడా అంతే ప్రేమిస్తోందన్నారు. కాగా ఈ ఈవెంట్‌కు సమంత చేతిలో జపమాలతో వచ్చారు. తన మాటల్లో, చేతల్లో తన ఆరోగ్య పరిస్థితిని చెప్పారు.