»Wife Sold For Changing Tv Channel Husband Dies Due To Resentment
Viral: టీవీ ఛానల్ మార్చమన్నందుకు అలిగిన భార్య.. మనస్తాపంతో ఉరేసుకుని భర్త మృతి
భర్త తనకు ఇష్టమైన సీరియల్ చూడొద్దన్నాడని, ఛానెల్ మార్చమన్నాడని ఓ భార్య పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
టీవీ సీరియల్ వల్ల ఓ పచ్చని కాపురంలో విషాదం నెలకొంది. ఛానల్ మార్చే విషయంలో తలెత్తిన గొడవ భర్త మృతికి కారణమైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో చోటుచేసుకుంది. కడంబత్తూరు గ్రామంలో ఆశీర్వాదం అనే వ్యక్తి తన భార్య నిషాతో కలిసి నివశిస్తున్నాడు. నిషాకు టీవీ సిరియల్స్ అంటే పిచ్చి. ఎప్పుడూ ఆమె ఏదోక సీరియల్ చూస్తూనే ఉండేది. ఈ క్రమంలో ఆశీర్వాదం ఎప్పటిలాగే ఇంటికొచ్చేసరికి నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తూ ఉంది.
అయితే ఆశీర్వాదం తన భార్యను ఛానెల్ మార్చమని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఆశీర్వాదం కోపంతో ఊగిపోయాడు. ఆ కోపం కాస్తా ఇద్దరి మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. ఆశీర్వాదం భార్యపై తీవ్రంగా అరవడంతో ఇద్దరి మధ్య మాటలు మరింత పెరిగాయి. దీంతో ఆశీర్వాదం విసిగిపోయి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
భర్తపై అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతసేపటికి ఇంటికొచ్చిన ఆశీర్వాదం తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయితే మరుసటి రోజు భార్యకు కోపం తగ్గి ఇంటికి చేరింది. అప్పటికే ఆశీర్వాదం ఇంట్లో ఉరి వేసుకుని కనిపించడాన్ని చూసి ఆమె షాక్ అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఇంటికి చేరుకుని విచారించారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.