Suicide: ప్రస్తుతం చాలామంది చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ దంపతుల మధ్య చట్నీ విషయంలో వచ్చిన గొడవ భార్య ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్లింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోప తండాకు చెందిన రమణ చందను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద రమణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చందన ఓ నగల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు.
సోమవారం ఉదయం రమణ డ్యూటీకి వెళ్లగా భార్య పలుమార్లు వీడియోకాల్స్ చేసింది. అతను స్పందించకపోవడంతో ఫోన్ చేసి కావాలనే గొడవ పడుతున్నవంటూ పెద్దగా కేకలు వేసి.. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలని కోరాడు. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే ఆమె విగతజీవిగా మారింది. రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు.