»Mohammed Shami Stood On 19th Floor Balcony As He Contemplated Suicide It Was 4 In The Morning When I Saw
Shami : షమీ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట!
జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొనే సమయంలో క్రికెటర్ షమీ ఆత్మహత్య చేసుకునేందుకు 19వ అంతస్థు బాల్కనీలో నిలబడ్డారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ఉమేష్ కుమార్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి.
Mohammed Shami : జీవితంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో భారత బౌలర్ మహ్మద్ షమీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ఉమేష్ కుమార్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. 2018 సంవత్సరంలో షమీ జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయాన్ని గడిపారని ఆయన అన్నారు. పెను తుపానే వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో ఓ వైపు ఆయన భార్య గృహ హింస కేసు పెట్టారు. మరో వైపు ఫిక్సింగ్ ఆరోపణలు ఆయన కెరియర్ను కుదిపేశాయి. ఇలా చాలా సమస్యలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి సమయంలో షమీ తన ఇంట్లోనే ఉన్నారని ఉమేష్ చెప్పారు. తమది 19వ అంతస్థులో ఉండే ప్లాట్ అని అన్నారు. ఓ రోజు తెల్లవారుజామున నాలుగింటి సమయంలో మంచినీరు తాగుదామని తాను నిద్ర లేచానని చెప్పారు. ఆ సమయంలో షమీ ఆత్మహత్య(suicide) చేసుకోవడానికి బాల్కనీలో నిలబడి సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘అప్పుడు ఏం జరుగుతోందో నాకు అర్థం అయ్యింది. ఆ రాత్రి చాలా సుదీర్ఘంగా నడిచింది. తర్వాత తనను తీసుకొచ్చి మేం మాట్లాడుకున్నాం’ అంటూ ఉమేష్ చెప్పారు.
‘షమీ(Mohammed Shami) తర్వాత నాతో మాట్లాడుతూ.. తాను అన్నింటినీ సహించగలను. కానీ దేశానికి ద్రోహం చేశానంటూ ఆరోపణలు రావడాన్ని సహించలేకపోతున్నానని చెప్పాడు’. అంటూ ఉమేష్ చెప్పారు. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలను విచారించిన కమిటీ షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. 2023 వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. కాలి చీలమండకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2024లో ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌లకు దూరం అయ్యారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు.